Delhi Liquor Case : : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు, అప్రూవర్‌గా నిందితుడు శరత్ చంద్రారెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపు తిరిగింది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు.
Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థతో పాటు పలు సంస్థల్లో శరత్ చంద్రారెడ్డికి భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో 2022 నవంబర్ 10వ తేదీన ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తుంది. ఈ విషయమై కోర్టుకు సమర్పించిన చార్జీసీట్లలో పలు అంశాలను పేర్కొంది.
గత నవంబర్‌లో అరెస్ట్ - మేలో బెయిల్
ఢిల్లీ మద్యం వ్యాపారంలో 30 శాతం దుకాణాలను శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ గతంలోనమోదు చేసిన ఛార్జ్ షీట్ లో ఆరోపించింది. బినామీ కంపెనీలతో కలిసి 9 జోన్లలో శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారాన్ని నిర్వహించినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సౌత్ గ్రూపు పేరుతో ఏర్పాటైన మద్యం సిండికేట్లలో శరత్ చంద్రారెడ్డి అతిపెద్ద భాగస్వామి గా ఉన్నారని ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముప్పై శాతం బిజినెస్ ఆయనదేనని పేర్కొంది. మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేయడం కోసం డిజిటల్ సర్వర్లలో ఉన్న సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు కూడా ప్రయత్నించినట్టు ఈడీ తన రిపోర్టులో పేర్కొంది.
అప్రూవర్ గా మారడంతో లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు
గత నవంబర్ నుంచి జైల్లో ఉన్న శరత్ చంద్రారెడ్డికి మే 8 ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.తన భార్యకు అనారోగ్యంగా ఉందని.. ఆమె బాగోగులు చూసుకోవాలని.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వారిలో శరత్ చంద్రారెడ్డికి మాత్రమే బెయిల్ లభించింది. మిగతా వారు జైల్లోనే ఉన్నాయి.
రాజకీయంగానూ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం కీలకమయ్యే అవకాశం
శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం రాజకీయంగానూ కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి. అరబిందో గ్రూప్ వ్యవస్థాపకుని వారసుడు అయిన శరత్ చంద్రారెడ్డి రాజకీయంగా కీలక సంబంధాలు కలిగి ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డి. ఏపీ సీఎం జగన్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయన గతంలో దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు వెళ్లిన పారిశ్రామిక వేత్తల బృందంలో శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. అలాగే ఏపీలో ఇటీవలి కాలంలో అరబిందో సంస్థ కొన్ని పోర్టులను కొనుగోలు చేసింది. అలాగే ఓ సెజ్ కూడా దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలోనూ అరబిందో ఫార్మా పరిశ్రమేకాకుండా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తోంది. అరబిందో రియాల్టీ పేరుతో హైలైజ్ అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు.