Amit Shah Etela Rajender Meet : తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ అడుగులు, అమిత్ షాతో ఈటల భేటీ!
Amit Shah Etela Rajender Meet : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ ను దిల్లీకి పిలిచి భేటీ అయ్యారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈటలకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.
Amit Shah Etela Rajender Meet : తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బీజేపీ అధిష్ఠానం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు తెలంగాణపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దిల్లీకి పిలిచిన అమిత్ షా ఆయనతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈటలను దిల్లీకి సడన్ గా పిలవడంపై ఆయనకు కొత్తగా ఏమైనా బాధ్యతలు అప్పగించబోతున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈటలకు జాతీయ స్థాయిలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అందుకే దిల్లీకి రమ్మన్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.
బీజేపీ వ్యూహాలపై చర్చ!
తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వలో జాతీయ పార్టీని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెసేతర, బీజేపేతర నాయకులతో వరుసగా భేటీ అవుతూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర మంత్రులు బీజేపీ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ తరచూ విమర్శలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మొదలైన అసమ్మతి నేటికీ కొనసాగుతోంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఆందోళన వెనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై తెలుసునేందుకు హుటాహుటిన హోంమంత్రి అమిత్ షా ఈటలతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో బీజేపీ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఈటలకు కీలక పదవి!
టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితులపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. త్వరలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నట్లు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ను ఎదురించి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కీలక పదవి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన దిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొంత మంది కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలతో ఈటల భేటీకానున్నట్లు సమాచారం. ఈటలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. రెండురోజుల పాటు ఈటల దిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. కీలక పదవి ప్రకటన తర్వాతే హైదరాబాద్‌కు ఈటల వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.