Telangana News: డాక్టర్లు, వైద్య సిబ్బందికి భద్రతపై దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు - వారి ఆందోళనకు మద్దతు
కోల్‌కత్తాలో ట్రెయినీ డాక్టర్ దారుణ ఘటనకు వ్యతిరేకంగా వైద్యులు, నర్సులు ఒకరోజు ఆందోళన బాట పట్టారు. డాక్టర్లు, సిబ్బంది ఆందోళనకు మంత్రి దామోదర రాజనర్సింహ మద్దతు తెలిపారు.
Doctor Murder at RG Kar Medical College in Kolkata | హైదరాబాద్: కోల్‌కత్తాలో ట్రెయినీ డాక్టర్ పై అత్యాచారం, ఆపై హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు ఆందోళన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఎమర్జన్సీ వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కోల్‌కత్తా డాక్టర్ హత్యాచార ఘటనపై డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేపట్టిన ఆందోళన, నిరసనకు తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంఘీభావం తెలిపారు. కులం, మతం, ప్రాంతం అంటూ ఏదీ పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్ పై ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ‘కోల్‌కత్తా ట్రెయినీ డాక్టర్ కేసును సీబీఐ అధికారులు వేగవంతం చేయాలి. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల ప్రిన్సిపల్స్, ఆస్పత్రుల సూపరిoటెoడెంట్లు డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్ల, వైద్య సిబ్బంది కి భద్రత కల్పించాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భద్రతపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించా. ఇలాంటి ఘటనలు జరగకుండా డాక్టర్లు, వైద్య సిబ్బంది భద్రతపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించా. డాక్టర్లు, నర్సులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అన్నారు.
హైదరాబాద్ లో నిరసన ర్యాలీ
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల: పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కత్తాలోని ఆర్జే కార్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 31 ఏళ్ల పీజీ విద్యార్థిని హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు, వైద్య విద్యార్థులు సూరారం చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్
ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ... మన దేశంలో వైద్యున్ని ఒక దైవం గా భావిస్తారు, కరోనా వ్యాప్తి లాంటి కఠిన సమయాల్లోనూ నిస్వార్థంగా తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా సేవలు అందిస్తున్నాం. కరోనా సమయంలో నెలలపాటు ఇంటికి వెళ్లని డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు. కుటుంబాన్ని దూరం పెట్టి మరీ ఎందరి ప్రాణాలు కాపాడారో అంతా చూశారు. కానీ అంత మంచి హోదాలో ఉండి, ప్రాణాలు కాపాడుతున్న తమపై ఇలాంటి ఘటనలు జరగడం దారుణం అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ డాక్టర్ పై దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. కిరాతకంగా చిత్ర హింసలు పెట్టి చంపటం దారుణం అన్నారు. ఆ నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని,
బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.