Telangana Culture: పల్లె జీవనం ప్రతిబింబించే మన 'తెలంగాణ' - చేనేత నుంచి ప్రసిద్ధ కళల వరకూ అన్నీ ప్రత్యేకతలే!
Art & Craft of Telangana: ఎన్నో సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు, ప్రకృతి పండుగలు కొలువై ఉన్న రాష్ట్రం. పురాతన కాలం నుంచే ఎన్నో కళలకు పుట్టినిల్లుగా నిలిచిన కోటి రతనాల వీణ.. తెలంగాణపై ప్రత్యేక కథనం.
Telangana Culture And Arts Specialities: పల్లె జీవనం.. జానపదం.. హస్తకళా ప్రావీణ్యం.. ఇలా ఒకటేమిటి.. 'కోటి రతనాల వీణ నా తెలంగాణ' అంటూ మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ణించిన కావ్యానికి సరిగ్గా అద్దం పడుతోంది మన 'తెలంగాణ'. పురాతన కాలం నుంచే కళలు, కళాకారులకు నెలవుగా.. సమాజానికి వినోదం, ఆహ్లాదం పంచేలా జానపద కళలు, ప్రకృతి గొప్పతనాన్ని వర్ణించేలా బతుకమ్మ పండుగ ఇలా అన్నీ కళలు, ప్రత్యేక నైపుణ్యాలు రాష్ట్రంలో నెలవై కొలువై ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రాచీన, జానపద కళలకు నిలయం. ఇక్కడ తయారయ్యే వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు కళలు, చేనేత ఉత్పత్తులు, కళాకారుల నైపుణ్యం, ఇందుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఓసారి పరిశీలిస్తే..
'ఫిలిగ్రీ' కళ
ఫిలిగ్రీ.. వెండి తీగతో ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులను కళాకారులు రూపొందించే గొప్ప కళ. పాశ్చాత్య దేశాల్లో ప్రాచీన కాలం నుంచే ఉన్న ఈ కళ.. ఇండోనేషియా, ఒడిశా నుంచి కరీంనగర్‌కు (Karimnagar) చేరింది. నాలుగు దశాబ్డాల ఈ హస్తకళకు కరీంనగర్ కళాకారులు జీవం పోస్తున్నారు. కాకతీయుల కాలం నుంచే ఫిలిగ్రీ గుర్తింపు పొందగా.. నిజాం కాలంలో నవాబులు ఈ వస్తువులను తయారు చేయించున్నట్లుగా చరిత్ర చెబుతోంది. మనసు దోచే వెండి జాలీల అల్లికల ఈ కళ కుతుబ్ షాహి, అసబ్ జాహి, గోల్కొండ నవాబుల ఆదరణతో అభివృద్ది చెందుతూ వచ్చింది. నిజాం రాజుల విలాసవంతమైన జీవితాలకు సిల్వర్ ఫిలిగ్రీ మరింతగా వన్నె తెచ్చింది. కొత్త కళాఖండాలు తయారు చేయడంపై కరీంనగర్ కళాకారులు దృష్టి సారించారు. ప్రపంచంలోనే అరుదైన కళగా గుర్తింపు పొందిన సిల్వర్ ఫిలిగ్రీ తరువాత కాలంలో విదేశాలకు సైతం వ్యాపించింది. వెండి తీగలను కావాల్సిన సైజుల్లో కత్తిరించి ఫ్రేముల్లో అమర్చుతూ ఓ అపు'రూపాన్ని' ఆవిష్కరిస్తారు. గత 20 ఏళ్లుగా అద్బుతమైన వస్తువులను తయారు చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు కరీంనగర్ కళాకారులు.
చేనేత కళలు
తెలంగాణ చేనేత కళలకు సైతం ప్రసిద్ది చెందింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోచంపల్లిలో తయారయ్యే పట్టుచీరలు, ప్రత్యేక వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాగే, సూది, నూలు దారాలే సాధనాలుగా ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో లేసు అల్లిక పరిశ్రమ ప్రసిద్ధి చెందింది. ఒకే చిత్రంలో అనేక రంగులు అద్దుతూ వస్త్రాలు తయారు చేసే అద్దకం వస్త్రాలకు మెదక్ జిల్లా పేరొందింది. ఈ ఉత్పత్తులకు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. అలాగే, సిద్ధిపేట, కురనపల్లి, పాదగల్, పెంబర్తి, పర్కాల ప్రాంతాల్లోని రాగి, సత్తు మిశ్రమంతో ఇత్తడి తయారవుతుంది. ఇక్కడి కళాకారులు దేవతా విగ్రహాలు, ఇత్తడి వాహనాలు తయారీలో నిపుణులు. అటు, నిర్మల్ జిల్లా బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. బొమ్మల తయారీకి బూరుగు, పొనుగు కర్రను ఉపయోగిస్తారు. ఏటికొప్పాకలో చదరంగపు బల్లలు, పన్నీరు బుడ్లు, పిల్లలకు పనికొచ్చే లక్కపిడతలు వంటివి తయారవుతున్నాయి.
రాష్ట్రం.. జానపదం
తెలంగాణ సమాజం సంస్కృతి, వారసత్వం, సాహిత్యం, నృత్యం వంటి సమాహార కళ. తోలు బొమ్మలాట, భాగవతాలు, కోలాటం, భజన, గంగిరెద్దుల వారు, గోండు నృత్యం, యక్షగానం, పులి నృత్యం, ఒగ్గు కథలు వంటి జానపద కళలు ప్రసిద్ధి చెందాయి. గ్రామాల్లో తోలు బొమ్మలాటలు ప్రదర్శించేవారు. ఓ తెర కట్టి తెర లోపల దీపాలు పెట్టి తోలుతో చేసిన రంగు రంగుల బొమ్మలను కథల రూపంలో ప్రదర్శించేవారు. బొమ్మల కాళ్లు, చేతులు, తలకు దారాలు కట్టి మధ్యలో ఓ డబ్బాలో నిలబెట్టి దారాన్ని లాగుతూ కథకు అనుగుణంగా వాటిని ఆడిస్తారు. అటు, భజనలు సైతం ప్రాచుర్యం పొందాయి. పండుగ, ఊరేగింపు రోజుల్లో భజనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దసరా, బతుకమ్మ సంబరాల్లో కోలాటం ఆడడం కూడా ప్రసిద్ధి చెందింది. అటు, గంగిరెద్దులాటను పూజగొల్ల కులానికి చెందిన కళాకారులు నిర్వహిస్తారు.
అంబరం.. తెలంగాణ సంబురం
పండుగల విషయంలో మన తెలంగాణది భిన్నమైన సంస్కృతి. కొన్ని సంబురాలు కులమతాలకు అతీతంగా నిర్వహిస్తారు. వాటిల్లో బోనాలు, ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ చాలా ప్రత్యేకం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బోనాలు పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాలు వైభవంగా నిర్వహిస్తారు. పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని కుండ (బోనం)లో పెట్టి దాన్ని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరిస్తారు. తర్వాత బోనాన్ని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే, బతుకమ్మ పండుగ.. ప్రకృతిని ఆరాధించే ముఖ్యమైన పండుగ. ఇది మహాలయ అమావాస్య రోజు మొదలవుతుంది. దసరా 9 రోజుల్లో వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను సుందరంగా అలంకరించి రోజుకో నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత ఆడవాళ్లు చుట్టూ చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు.
జాతరే జాతర
తెలంగాణ జాతర అంటేనే మనకు గుర్తొచ్చేది అతి పెద్ద గిరిజన పండుగ మేడారం. ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఓసారి మేడారం గ్రామంలో జరుగుతుంది. కాకతీయులతో వీరోచితంగా పోరాడిన తల్లీకూతుళ్లు సమ్మక్క, సారలమ్మలు ఇక్కడ దేవతలుగా వెలిశారని నమ్ముతారు. పౌర్ణమి రోజు సాయంత్రం కన్నెబోయినపల్లె గ్రామం నుంచి సారలమ్మ అమ్మవారిని గిరిజన పూజారులు తీసుకొస్తారు. తర్వాత చిలుకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకొస్తారు. 3 రోజుల పూజల అనంతరం తిరిగి వాటిని వన ప్రవేశం చేయిస్తారు. మన దేశంలో కుంభమేళా తర్వాత ఎక్కువ మంది హాజరయ్యే జాతర ఇదే. బెల్లాన్ని అమ్మవార్లకు బంగారంగా సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
ఇక తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర పెద్దగట్టు జాతర. ఈ వేడుక ప్రతీ రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా చౌడమ్మదేవి, లింగమంతుల స్వామికి 5 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరకు ప్రతిసారి 10 - 15 లక్షల మంది హాజరవుతారు. అలాగే, మెదక్ జిల్లాలోని నాగ్సాన్ పల్లిలో ఏడుపాయల జాతర ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఈ జాతర నిర్వహిస్తారు. మంజీరా నది ఏడుపాయలుగా చీలిపోయిన చోట ఈ ఆలయం కొలువై ఉండగా.. జాతర సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అటు, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోనూ మల్లికార్జున స్వామి జాతర ప్రసిద్ధి చెందింది. ఒగ్గు పూజారులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహా శివరాత్రి టైంలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది. అలాగే, సదరన్ పండుగను హైదరాబాద్ లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బలంగా ఉన్న దున్నపోతులను ఊరేగిస్తారు.