CPI Narayana: అమెరికాలో సీపీఐ నారాయణకు చేదు అనుభవం, ఆయనతో ఫోటో దిగినందుకేనా!
ఫ్లోరిడా విమానాశ్రయంలో నారాయణను ఆపిన ఎయిర్ పోర్టు సిబ్బంది ఆయన ప్రయాణ వివరాలను అడిగారు. ఆయన లగేజీలోని వస్తువులను పరిశీలించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన అమెరికా, క్యూబా పర్యటనలకు వెళ్లిన సందర్భంగా ఈ పరిణామం జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు నారాయణను నిలిపి వేశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి క్యూబాలోని హవానా విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
క్యూబాలో జరిగిన అంతర్జాతీయ పార్టీ సమావేశాల్లో పాల్గొనడానికి కె.నారాయణతో కూడిన భారత బృందం అక్కడికి వెళ్లింది. ఆ సందర్భంగా క్యూబా దేశ అధ్యక్షుడితో కె.నారాయణ ఫోటో దిగారు. అక్కడి నుంచి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న తన మనవణ్ని చూసేందుకు నారాయణ వెళ్లారు. క్యూబా రాజధాని హవానా నుంచి పెరూ మార్గంలో ఫ్లోరిడా వెళ్లారు. ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో దిగగానే అదే సమయంలో ఎయిర్ పోర్ట్ సిబ్బంది నారాయణను విచారణ పేరుతో ఆపేశారు. అమెరికా వీసా ఉన్నప్పటికీ ఆయనను ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తీరుపై నారాయణ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎందుకు ఆపారంటే..
ఫ్లోరిడా విమానాశ్రయంలో నారాయణను ఆపిన ఎయిర్ పోర్టు సిబ్బంది ఆయన ప్రయాణ వివరాలను అడిగారు. ఆయన లగేజీలోని వస్తువులను పరిశీలించారు. ఫోన్‌ను కూడా పరిశీలించారు. ఫోన్‌లో క్యూబా దేశ అధ్యక్షుడు మిగుల్ మారియో డియాజ్ క్యానెల్ బెర్ముడెజ్ తో దిగిన ఫోటోను అధికారులు చూసి సుమారు 6 గంటలపాటు అక్కడే ఆపేశారు. అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుని విడిచిపెట్టారు. సోమవారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో నారాయణ ఈ వివరాలను వెల్లడించారు.
క్యూబా రాజధాని హవానాలో ఈ నెల 27 నుండి 29 వరకు 22వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశాలు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ నేతృత్వంలో బృందం ఈ సమావేశాలకు హాజరైంది.
అమెరికా - క్యూబా దేశాలు పరస్ఫర శత్రు దేశాలు అనే సంగతి తెలిసిందే. ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న విద్వేషాల పర్యవసానాలు ఒక క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తాయి. ఈ రెండు దేశాల మధ్య గొడవల కారణంగా 1962లో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే క్యూబాను దురాక్రమించబోనని అమెరికా హామీ ఇవ్వడంతో పరిస్థితి చక్కబడింది. తమ కంట్లో నలుసులా మారిన అప్పటి క్యూబా అధినేత ఫిడేల్ కాస్ట్రోను అడ్డు తొలగించుకోవడానికి అమెరికా తన గూఢచార సంస్థ సీఐఏ ద్వారా చాలా ప్రయత్నాలు చేసింది.
ఆ పార్టీలతో కలుస్తాం - నారాయణ
ఇటీవలే విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కె. నారాయణ, ఎఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరిజిత్ కౌర్, ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామక్రిష్ణ, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, దేశ నలుమూలల నుంచి పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే వారందరితో చర్చలు జరుపుతామని, వాళ్లతో కలిసి పనిచేస్తామని అన్నారు.