(Source: ECI/ABP News/ABP Majha)
Covid19 cases: తెలంగాణలో కరోనా టెన్షన్- ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు పాజిటివ్
MGM Warangal: తెలంగాణలో కరోనా మరోసారి భయపెడుతోంది. వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Six children Covid positive in MGM: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆరుగురు చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆరుగురు చిన్నారులు వరంగల్ పట్టణానికి చెందిన వారే అని తెలుస్తోంది. ఆరుగురు చిన్నారులు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. వారికి కరోనా లక్షణాలు ఉండటంతో... కాకతీయ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్ కోవిడ్ 19 పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆరుగురు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెట్ డాక్టర్ చంద్రశేఖర్ శనివారం ధృవీకరించారు. ఎంజీఎం ఆస్పత్రిలోని ముందు జాగ్రత్తగా పీడియాట్రిక్ వార్డులో ఇప్పటికే 20 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఆ వార్డులోనే ముగ్గురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల నీలోఫర్ ఆస్పత్రిలోనూ ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చిన్నపిల్లలు కూడా కరోనా బారిన పడుతుండటంతో... ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశంలో కొత్త వేరియంట్ జేఎన్-1 వ్యాప్తి.. టెన్షన్ కలిగిస్తోంది. అసలే చలికాలం.. ఈసారి చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలా మంది జలుబు, దగ్గు, జర్వాలతో బాధపడుతున్నాయి. వీరిలో ఎవరిది కోవిడ్ ఉంది... ఎవరిది సాధారణ జలుబు అని తెలిసుకోవడం కష్టంగా మారింది. వైద్యులు మాత్రం.. ఏమాత్రం అశ్రద్ధ వద్దని సూచిస్తున్నారు. అనుమానం ఉంటే.. వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని చెప్తున్నారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని.. శానిటైజర్లు వాడాలని సూచిస్తున్నారు.
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. గత 24 గంటల్లో 743 కొత్త కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 225 రోజుల తర్వాత ఇదే అత్యధికమని.. ఒక్క మహారాష్ట్రలోని 129 కొత్త కేసులు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 3,997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేరళకు చెందిన వారు ముగ్గురు, కర్ణాటకకు చెందిన వారు ఇద్దరు, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కరు మృతిచెందినట్టు నమోదైంది. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ జేఎన్-1 వ్యాప్తి కూడా వేగంగా ఉంది. కొత్త కేసులు కూడా పదుల నుంచి వందల్లోకి వచ్చేశాయి. అయితే కొత్త వేరియంట్‌తో భయపడాల్సిన అవసరం లేదని... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్తోంది. కానీ... అప్రమత్తతంగా ఉండాలని సూచిస్తోంది.
రాబోయేది పండుగ సీజన్. న్యూయర్, సంక్రాంతి.. అన్నీ అందరూ కలిసి జరుపుకునే సంబరాలే. ఇలాంటి సమయంలో... జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు వైద్యు నిపుణులు. పది మందితో గుమికూడినప్పుడు మాస్కులు పెట్టుకోవడం మర్చిపోవద్దని.. ఇది... కరోనా వ్యాప్తిని అరికడుతుందని పదే పదే సూచిస్తున్నారు. ఇక.. చేతులు పదే పదే శుభ్రం చేసుకోవడం... వీలైనన్ని సార్లు శానిటైజర్ వాడటం ఉత్తమమని చెప్తున్నారు. కరోనా బారిన పడకుండా.. జాగ్రత్తలు తీసుకోవడం మేలని హితవు పలుకుతున్నారు. ప్రజలంతా.. పండుగ సీజన్‌లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పదేపదే సూచిస్తున్నారు. సో... బీకేర్ ఫుల్... అండ్ బివేర్ ఆఫ్ కరోనా.