Wyra Gurukul School: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్
Wyra Gurukul School: గురుకుల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది టెస్టులు నిర్వహించగా మొత్తం 29 మందికి కొవిడ్19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇటీవల రెసిడెన్షియల్ విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. రెసిడెన్సియల్ స్కూల్స్‌లో బోధన సజావుగా సాగుతుందనుకున్న సమయంలో కరోనా పంజా విసురుతోంది. ఖమ్మం జిల్లా వైరాలో గురుకుల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. ఇటీవల జరిపిన టెస్టుల్లో 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. ఆ సంఖ్య తాజాగా 29కి చేరింది. ఒకేసారి అంతమంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇతర విద్యార్థినులు, గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లలో ఆందోళన మొదలైంది. 8వ తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థినులకు కరోన పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల స్కూల్, బాలికల జూనియర్ కాలజీలో విద్యార్థినులు కొందరికి జ్వరం వచ్చింది. కరోనా లక్షణాలు సైతం కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఇందులో మొత్తం 29 మందికి కొవిడ్19 పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బి మాలతీ తెలిపారు. విద్యార్థినులకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాజిటివ్‌గా తేలిన వారందర్నీ ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. కొందర్ని వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి హోమ్ క్వారంటైన్‌లో ఉంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: ఏపీలో కొత్తగా 127 కరోనా కేసులు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నందున ఎవర్నీ ఆసుపత్రిలో చేర్పించలేదని డాక్టర్ బి మాలతీ స్పష్టం చేశారు. కానీ స్కూల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని, పిల్లలకు కొవిడ్19 పాజిటివ్ అని తమకు సైతం ఆలస్యంగా తెలిపారని మరికొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. గత నెలలో తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ తెరిచాక భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఉన్నతాధికారులు తనిఖీలు..
గురుకుల పాఠశాల, కాలేజీలో కరోనా కేసులు ఘటన వెలుగుచూడటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. స్కూలుకు వెళ్లి పరిశీలించి.. సోషల్ డిస్టాన్సింగ్, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం లాంటి కోవిడ్19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్కూలు అధికారులకు సూచించారు.
మొత్తం 550 మంది స్టూడెంట్స్..
వైరాలోని గురుకుల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో మొత్తం 550 స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో దాదాపు సగం మందికి జ్వరం, దగ్గు లాంటి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆదివారం నాడు 225 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. సోమవారం మరికొందరికి టెస్టులు నిర్వహించగా.. అందులో 39 మందికి కొవిడ్19 పాజిటివ్‌గా తేలింది. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అక్టోబర్ చివరి వారంలో రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు సైతం కొవిడ్ నిబంధనలతో తెరుచుకున్నాయి.
Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు