Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టికి అవమానమంటూ విమర్శలు - కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ట్వీట్
Telangana News: యాదాద్రీశుని ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టికి అవమానం జరిగిందన్న ప్రతిపక్షాల విమర్శలపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ అంటేనే ఆకాశమంత సమానత్వం అంటూ ట్వీట్ చేసింది.
Congress Counter Tweet on Opposition Slams on Bhatti Vikramarka Issue: యాదాద్రి లక్ష్మీ నరసింహుని సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టికి విక్రమార్కకు (Bhatti Vikramarka) అవమానం జరిగిందన్న ప్రతిపక్ష నేతల విమర్శలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు కౌంటర్ ట్వీట్ చేసింది. 'కాంగ్రెస్ అంటేనే ఆకాశమంత సమానత్వం' అంటూ రాహుల్ గాంధీ పక్కన భట్టి విక్రమార్క కూర్చుని అల్పాహారం తీసుకుంటున్నా ఫోటోను ట్వీట్ చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్కతో కలిసి రాహుల్ గాంధీ అల్పాహారం తీసుకుంటున్న చిత్రాన్ని షేర్ చేసింది. అలాగే, 'మీకెక్కడిది దళిత ప్రేమ' అంటూ మరో ట్వీట్ చేసింది. 'యాదగిరిగుట్టలో ఈ రోజు వీలుని బట్టి మా మంత్రులు కూర్చుంటే దాన్ని కూడా రాజకీయం చేసి, అక్కడ దళిత కార్డు వాడాలని చూసే మీ భావ దారిద్య్రాన్ని చూస్తే ఏవగింపు పుడుతుంది. మీకెక్కడిది దళిత ప్రేమ?! ఉద్యమం ఉప్పెనలా ఎగసినప్పుడు తమరు ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీతో మొదలెడితే... అధికారం కోల్పోయే దాకా తమరు దళిత సమాజానికి ద్రోహం చేసిన సంఘటనలు కోకొల్లలు.!!. ఎన్నికల ముందు అంబేడ్కర్ గారి విగ్రహంతో రాజకీయం చేయాలని చూసినా.. నిన్ను అథఃపాతాళానికి తోసేశారు మా దళిత సోదరులు..!! ఎందుకనేదీ ఆత్మ విమర్శ చేసుకో...! మచ్చుకు కొన్ని విషయాలు గుర్తుకు చేస్తాం... గుర్తుకు తెచ్చుకొని తలదించుకొండి సిగ్గుతో..!!' అంటూ ఓ ఫోటోను ట్వీట్ లో చేసింది.
యాదగిరిగుట్టలో ఈ రోజు వీలుని బట్టి మా మంత్రులు కూర్చుంటే దాన్ని కూడా రాజకీయం చేసి, అక్కడ దళిత కార్డ్ వాడాలి అని చూసే మీ భావ దారిద్య్రాన్ని చూస్తే ఏవగింపు పుడుతుంది.
— Telangana Congress (@INCTelangana) March 11, 2024
మీకెక్కడి దళిత ప్రేమ?! ఉద్యమం ఉప్పెనలా ఎగసినప్పుడు తమరు ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీతో మొదలెడితే... అధికారం… pic.twitter.com/zyFomQURJT
కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వం.💙@Bhatti_Mallu @KomatireddyKVR pic.twitter.com/dURW7xLxcJ
— Congress for Telangana (@Congress4TS) March 11, 2024
ఇదీ జరిగింది
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతులు సహా పలువురు మంత్రులు సోమవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా సీఎం దంపతులు తొలి పూజలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. స్వామి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం సీఎం దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సమయంలో ఇతర మంత్రులు స్టూల్స్ పై కూర్చోగా భట్టి విక్రమార్క కింద కూర్చోవడంపై ప్రతిపక్ష నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం జరిగిందని అన్నారు. దళితులకు అవమానాలు లేని పోరాటం కోసమే బీఎస్పీ పోరాటం చేస్తుందన్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ కవిత సైతం దీనిపై స్పందిస్తూ సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'రెడ్డి నాయకుల దగ్గర ఓ ఎస్సీ బిడ్డను క్రింద కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను క్రింద కూర్చోబెట్టారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.... ఎక్కడ చెప్పుకోవాలి... ఎవరికి చెప్పుకోవాలి.? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన భట్టినే అవమానించారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బట్టి విక్రమార్క ఫోటో పక్కన పెడుతున్నారు. ప్రభుత్వ యాడ్స్ లో భట్టి ఫోటోను పక్కన పెట్టారు. ఎస్సీలకు డిప్యూటీ సీఎం, మంత్రి పదవి ఇచ్చి పెద్దపీట వేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. దళితులు, బీసీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుంటున్న నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలి. దీనిపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ స్పందించాలి. దీనిపై సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. ఇలాంటివి భవిష్యత్ లో జరగకుండా చూడాలి.' అని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.