Congress Public Meeting: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు! కానీ వచ్చేది కాంగ్రెస్ సర్కార్ - రాహుల్ గాంధీ
Congress Public Meeting in Mulugu: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు జిల్లాలో రాహుల్, ప్రియాంక బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలకు పలు హామీలు ఇచ్చారు.
Congress Public Meeting: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ములుగు జిల్లా రామంజపూరంలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ పాల్గొని ప్రసంగించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అభివృద్ది అనే గ్యారంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇస్తానన్న మూడెకరాల భూమి వచ్చిందా? రూ.లక్ష రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? ఉద్యోగాలు ఇస్తానని హామీలు ఇచ్చారు, వచ్చాయా? అవినీతిరహిత పాలన అందిస్తామన్నారు.. అవినీతి చేశారా లేదా? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఎంతమందికి ఇచ్చారు? అని రాహుల్ ప్రశ్నించారు. కర్ణాటకలో మహిళలకు వారి అకౌంట్‌లో ఉచితంగా డబ్బు పడుతోందని, తెలంగాణలో కూడా అలాగే ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని, కావాలంటే కర్ణాటక వెళ్లి చూడాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రియాంకగాంధీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసిందని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని, రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని తెలిపారు. రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారని ప్రియాంకగాంధీ తెలిపారు.
'సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని అనుకున్నారు. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని అనుకున్నారు. తెలంగాణ వస్తే రైతుల జీవితం బాగుపడుతుందని ఆశించారు. అయితే బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలను ఇచ్చారు. తెలంగాణ అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్‌మ్యాప్ రూపొందించింది. ప్రజల కోసం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తీసుకొస్తుంది. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చేలా గ్యారంటీ కార్డు ఇస్తున్నాం' అని ప్రియాంక స్పష్టం చేశారు.
'కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటాం. రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత, ఉద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలోనూ భారీగా అవినీతి జరుగుతోంది. విద్యాలయాల్లోనూ బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు జరగలేదు. ప్రభుత్వ వర్సిటీలను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వర్సిటీలను ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతను ఆదుకుంటాం. అలాగే రైతులకు సంబంధించి అన్ని పంటలకు మద్దతు ధరలకంటే ఎక్కువ చెల్లిస్తాం. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం' అని ప్రియాంక హామీ ఇచ్చారు.