MLA Seethakka: తెలంగాణ యువతకు అన్యాయం, ఉద్యోగాలను బీఆర్ఎస్ అమ్ముకుంటోంది - ఎమ్మెల్యే సీతక్క
MLA Seethakka: తెలంగాణ రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని DLR గార్డెన్‌లో జరిగిన మండల స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
MLA Seethakka: తెలంగాణ రాష్ట్రంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని DLR గార్డెన్‌లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ములుగు మండల పరిధిలోని అన్ని గ్రామాలకి సంబందించిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. యువకుల బలిదానాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.. తెలంగాణలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీతక్క వాపోయారు. లీకేజీల పేరుతో ఉద్యోగుల ప్రశ్న పత్రాలను ప్రభుత్వం అమ్ముకుందన్నారు. గల్లీకో వైన్ షాపు, ఇంటింటికో ఒక మద్యం షాపు పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం యువతను తప్పుదారి పట్టిస్తోందన్నారు. కరోనా సమయంలో ములుగు జిల్లాలో ఒక్క నాయకుడు కనిపించలేదని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ములుగుకి నేతలు క్యూ కట్టారంటూ మండిపడ్డారు.
మరో మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామన్నారు. రాబోయే కాలంలో ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామన్నారు. టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్‌గా మార్చడంతో రాష్ట్రంతో పేరు బంధంతో పాటు పేగు బంధాన్ని కూడా కేసీఆర్ తెంచుకున్నారని విమర్వించారు. ‘ఓట్లప్పుడు పంచుదాం.. అధికారంలోకి రాగానే దోచుదాం’ అనేది ఇతర పార్టీల సిద్ధాంతం అని సీతక్క అన్నారు. ప్రజలకు మేలు చేయడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అన్నారు.
ములుగు నియోజకవర్గం తన ఇల్లు అని, ములుగు ప్రజలు తన కుటుంబం అని సీతక్క అన్నారు. తన కుటుంబాన్ని తన నుంచి విడతీయలేరని అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ప్రజలే తన కుటుంబం అని, నియోజకవర్గ ప్రజలే తనను ఆశీర్వదిస్తారని అన్నారు. సీతక్క బాగా పని చేస్తుందని అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలే పొగుడుతున్నారని.. కానీ, ఇక్కడికి వచ్చి ఓడించమంటున్నారని అన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు.
ప్రశ్నించే గొంతు నొక్కలేరు
ములుగు నియోజకవర్గంలో తనను ఓడించడానికి బీఆర్ఎస్ నేతలు డబ్బుల సంచులతో దిగుతున్నారని అక్కడి ఎమ్మెల్యే సీతక్క గతంలో ఆరోపించారు. ప్రజా సేవకు డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందని అన్నారు. తాను ఎక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. ప్రశ్నించే గొంతు నొక్కడానికే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడతల దండు తరహాలో బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మంత్రులకు పక్క నియోజకవర్గాల మీద ఉన్న ప్రేమ తమ నియోజకవర్గాల మీద ఉండటం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులంతా దండయాత్రలు చేసి ములుగును భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు.