Telangana elections 2023: 'సీపీఎం జాబితా ఆపండి' - తమ్మినేనికి కాంగ్రెస్ సీనియర్ నేతల ఫోన్
Telangana elections 2023: సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా అపాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, భట్టి ఫోన్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సీపీఎం 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ జాబితా ఆపాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి, జానారెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి ఫోన్ చేశారు. అయితే, ఇప్పటికే జాబితా ప్రకటించేశామని, జాబితా ఆపడం కుదరదని తమ్మినేని వారికి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ తో మాట్లాడడం తప్ప ఎలాంటి నిర్ణయం లేదని ఆయన వారితో చెప్పినట్లు సమాచారం.
గందరగోళమే
కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తుల వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్టులు గత కొంత కాలంగా కాంగ్రెస్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, మిర్యాలగూడ, వైరా స్థానాలపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వని నేపథ్యంలో సీపీఎం ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తమ్మినేని ప్రకటించారు. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ వైఖరి అవమానించేలా ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, ఆదివారం ఉదయం 14 మందితో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తొలి జాబితా విడుదల చేశారు. మరో 3 స్థానాలైన నల్గొండ, హుజూర్ నగర్, కోదాడ స్థానాల్లో అభ్యర్థులను సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. తమ్మినేని ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో పాటు మేనిఫెస్టోను సైతం ప్రకటించారు. పొత్తులపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుని సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలపనున్నట్లు తమ్మినేని స్పష్టం చేశారు. మొదట, సీపీఎంను అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. సీపీఐ పోటీ చేసిన చోట పోటీ చేయబోమని, ఆ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు.
అభ్యర్థులు వీరే
- భద్రాచలం (ఎస్టీ) - కారం పుల్లయ్య
- అశ్వారాపుపేట (ఎస్టీ) - పిట్టల అర్జున్
- పాలేరు - తమ్మినేని వీరభద్రం
- మధిర (ఎస్సీ) - పాలడుగు భాస్కర్
- వైరా (ఎస్టీ) - భూక్యా వీరభద్రం
- ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్
- సత్తుపల్లి (ఎస్సీ) - మాచర్ల భారతి
- మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి
- నకిరేకల్ (ఎస్సీ) - చినవెంకులు
- భువనగిరి - కొండమడుగు నర్సింహ
- జనగాం - మోకు కనకారెడ్డి
- ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య
- పటాన్ చెరు - జె.మల్లికార్జున్
- ముషీరాబాద్ - ఎం.దశరథ్
సీపీఐకి మద్దతు
అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని, అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేస్తే ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. అటు, సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఖరారైంది. కొత్తగూడెం సీటు, మరో ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చింది. మునుగోడులో స్నేహ పూర్వక పోటీ చేస్తామని చెప్పగా, అలా వద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ - ఆ స్థానం నుంచే తమ్మినేని పోటీ