Rahul Gandhi Tour: వరంగల్‌కు రాహుల్ గాంధీ.. అదే రోజు హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తారా ఏంటి?
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా రాహుల్ గాంధీ వరంగల్‌కు రానున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో వెళ్తోంది. దళిత, గిరిజన దండోరా పేరుతో సభలు నిర్వహిస్తున్న హస్తం పార్టీ.. వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. తెలంగాణ విలీన దినోత్సవం సెప్టెంబర్ 17 రోజునే బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ రోజు వరంగల్‌లో జరిగే సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రానున్నారు. కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై చర్చించినట్టు సమాచారం. అయితే ఏఐసీసీ నుంచి అధికారిక షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో తొలి దళిత, గిరిజన దండోరా సక్సెస్ అయ్యాక రేవంత్ రెడ్డి జోరు పెంచారు. ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభ తరువాత ఆయన మరింత ఉత్సాహంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సభకు కూడా జనం చాలా మంది రావడంతో ఇక కాంగ్రెస్ జోరు పెంచింది. రావిర్యాల సభలో వర్షం పడుతున్నా.. లెక్కచేయకుండా.. నేతలు స్పీచ్ ఇస్తుంటే.. కార్యకర్తలు ఉత్సాహంగా విన్నారు. ఈ సభకు భారీ ఎత్తున జనం రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఇక ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు.. జనంలోకి వెళ్తున్నాయి. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ మాత్రమే దిక్సూచి అని కాంగ్రెస్ చెబుతోంది. దళిత, గిరిజన దండోరాతోనే జనంలోకి వెళ్లడమే సరైన ప్లాన్ అన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. వరంగల్ కు రాహుల్ గాంధీని రప్పించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు.
మరోవైపు వరంగల్ దగ్గరలోనే ఉన్నా... హుజూరాబాద్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకమైన తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక ఇది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్ లో కాంగ్రెస్ తరఫున నియోజక వర్గ ఇన్ ఛార్జి పాడి కౌశిక్ పార్టీ అభ్యర్థి అని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ ఆయన టీఆర్ఎస్లో చేరటంతో సీన్ మారింది. ఆ తర్వాత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్పేరు తెర మీదకు రాగా ఆయన పోటీకి నిరాకరించారు. గతంలో సిరిసిల్ల నుంచి పోటీ చేసిన కె.కె.మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ లాంటి నేతల పేర్లు వినిపించాయి. మరోవైపు కొండ సురేఖ పేరు కూడా వినిపించింది. హుజూరాబాద్ పక్కనే ఉన్న పరకాల నియోజకవర్గం ఆమెది. సమీకరణాలు కూడా సరిపోతాయన్న అంచనా కాంగ్రెస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
హుజూరాబాద్ఎన్నికలు తమకు లెక్క కాదని రేవంత్ ఈ మధ్యే మీడియాతో చెప్పారు. ఎంతో కొంత అక్కడ సత్తా చూపాలని పార్టీ నేతలతో అంటున్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ వరంగల్ వచ్చిన రోజునే.. హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తారేమోనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.