Congress Politics: నలువైపులా నాలుగు వివాదాలు - రచ్చకెక్కిన మంత్రుల తీరు, తలపట్టుకుంటున్న హైకమాండ్!
కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం కాంగ్రెస్‌లో సంచలనంగా మారింది. బీసీ మంత్రిగా కొండా సురేఖ, రెడ్డి సామాజిక వర్గం మంత్రిగా పొంగులేటి మధ్య వివాదంగా ఇది రూపుదిద్దుకుంది.

Telangana Local Body Elections | తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. మంత్రులు, కీలక నేతలు బహిరంగంగా కామెంట్స్ చేసుకోవడం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఇందుకు ఇటీవల జరిగిన వరుస సంఘటనలే కాంగ్రెస్ పార్టీ తీరును బయటపెడుతున్నాయి.
1. కొండా సురేఖ, పొంగులేటి వివాదం - బీసీ వర్సెస్ రెడ్డి వివాదంగా
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం కాంగ్రెస్‌లో సంచలనంగా మారింది. బీసీ మంత్రిగా కొండా సురేఖ, రెడ్డి సామాజిక వర్గం మంత్రిగా పొంగులేటి మధ్య వివాదంగా ఇది రూపుదిద్దుకుంది. తన శాఖలోని పనులకు టెండర్లను తమ వారిని కాదని, మంత్రి పొంగులేటి తన మనుషులకు ఎలా ఇప్పించుకుంటారని, ఈ జోక్యం తగదన్నది కొండా సురేఖ వాదనగా ఉంది. ఈ విషయంలో ఇరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం రాజుకుని పార్టీలో బీసీ, రెడ్డి వర్గాల మధ్య సంఘర్షణగా మారింది. బీసీ మంత్రి అయిన తనను కొందరు రెడ్డి మంత్రులు పదవి నుంచి తొలగించడానికి కుట్రలు పన్నుతున్నారని మీడియా చిట్ చాట్‌లో కొండా సురేఖ చెప్పడం సంచలనం సృష్టించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో హైకమాండ్ తలపట్టుకుంటోంది. ఇలా క్యాబినెట్ మంత్రుల మధ్య పోరు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌ను పలుచన చేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, టెండర్లలో మంత్రుల జోక్యం ఈ వివాదం వల్ల బహిర్గతమైంది (లేదా బహిర్గతం అవుతోంది).
2. కొండా సురేఖ - సీఎం రేవంత్ రెడ్డి వివాదం - సీఎంకు అంటుకున్న ఆరోపణలు
కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ను జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ ఇంటి వద్ద అరెస్టుకు పోలీసులు ప్రయత్నించడం, ఈ అరెస్టును కొండా సురేఖ కుమార్తె సుష్మిత అడ్డుకోవడం పెద్ద వివాదానికి దారి తీసింది. దక్కన్ సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని గన్‌తో సుమంత్ బెదిరించారన్నది పోలీసుల ఆరోపణ. దీనిపై మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారని, సీఎం ఆదేశాల మేరకు అధికారులు సుమంత్‌ను ఓఎస్‌డీ పదవి నుంచి తొలగించడం జరిగింది. అంతే కాకుండా పోలీసులు కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ను మంత్రి ఇంటి వద్దే అరెస్టు చేసేందుకు వెళ్లడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ సందర్భంగా కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత సీఎంపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. గన్ బెదిరింపు విషయంలో సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఉన్నారని, ఆయనకు సీఎం గన్ ఇచ్చి పంపారని సుష్మిత ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సీఎం సోదరులు భూదందాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో హైకమాండ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా సీఎంపై క్యాబినెట్ మంత్రి కూతురు ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఈ వివాదం పరిష్కారం అయినప్పటికీ సుష్మిత చేసిన ఆరోపణలు ఇప్పుడు సీఎం రేవంత్‌కు ఓ మచ్చగా మారాయి. క్యాబినెట్ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. తొలగిస్తే బీసీ మంత్రిని తొలగించారన్న అపవాదు కాంగ్రెస్ సర్కార్‌పై పడి ఉండేది. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో కొండా సురేఖ క్షమాపణలతో ఈ వివాదం ముగిసింది. అయినా గన్ పెట్టిన కేసు వివాదం తేలలేదు. సీఎంపై ఆరోపణల్లో వాస్తవాలు ఎంత అన్న దానిపై క్లారిటీ లేదు. ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇవి ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయి.
3. పొన్నం - అడ్లూరి వివాదం - మాదిగ సామాజిక వర్గాన్ని కించపర్చారన్న ఆరోపణలు
కొండా వివాదం బీసీల రంగు పూసుకుంటే, ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్ - అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ల మధ్య వాగ్వాదం మాదిగ సామాజిక వర్గం కినుక వహించేలా చేసింది. ఓ సమావేశంలో పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరిని అనుచితంగా సంబోధించారని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో హల్ చల్ చేసింది. అయితే దీంతో పొన్నం బేషరతుగా క్షమాపణ చెప్పాలని, తను మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి అయ్యాను కాబట్టే అలా విలువ లేకుండా మాట్లాడుతున్నారని అడ్లూరి డిమాండ్ చేయడం జరిగింది. అయితే తాను తన సిబ్బందిని సంబోధించానే తప్ప, మంత్రి అడ్లూరిని కాదని పొన్నం వివరణ ఇచ్చారు. అయినా దీనికి మంత్రి అడ్లూరి, ఆయన మద్దతుదారులు, మాదిగ సామాజిక వర్గ సంఘాలు మాత్రం సంతృప్తి చెందలేదు. ఈ పరిస్థితుల్లో హైకమాండ్ జోక్యం చేసుకుంది. సీఎం రేవంత్ సూచనల మేరకు దీనిపై మంత్రి పొన్నం విచారం వ్యక్తం చేస్తూ మీడియా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయినప్పటికీ మంత్రి అడ్లూరి మాత్రం తనకు క్షమాపణ చెప్పకుండా విచారం వ్యక్తం చేయడం ఏంటని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పెద్దల సూచనల మేరకు ఇష్టం లేకున్నా అడ్లూరి ఈ వివాదాన్ని ముగించారు. అయితే ఈ ఉదంతం క్యాబినెట్‌లో మంత్రుల మధ్య సయోధ్య లేదన్న అంశాన్ని రూఢీపరుస్తోంది. సామాజిక వర్గాల వారీగా విడిపోయారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తాయన్న ఆందోళనలో హైకమాండ్ ఉంది.
4. మంత్రి జూపల్లి - సీఎం రేవంత్ రెడ్డి వివాదం - ఇది ఓ నిశ్శబ్ద యుద్ధం
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్నాయన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మద్యం బాటిళ్లపై అంటించడానికి ఈ హోలోగ్రామ్ లేబుల్స్‌ను ఉపయోగిస్తారు. హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ లేబుల్స్ వేయాల్సి ఉంటుంది. నకిలీ మద్యం, అక్రమ మద్యం రవాణా మరియు ఎక్సైజ్ పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఈ లేబుల్స్‌లో బార్‌కోడ్, ఐటీ ట్రాకింగ్ సిస్టమ్ వంటి భద్రతా అంశాలు ఇందులో ఉంటాయి. దీనికి సంబంధించిన 500 కోట్ల విలువైన టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అల్లుడికి ఇప్పించాలని ప్రయత్నించారని, జూపల్లి తన కొడుకుకు ఆ టెండర్లు దక్కాలని ప్రయత్నించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ విషయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి నలిగిపోయారని ఈ క్రమంలోనే ఆయన వీఆర్‌ఎస్ తీసుకున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే రిజ్వీ వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే తన శాఖలో తన ఆదేశాలు పాటించకుండా ప్రభుత్వానికి నష్టం చేసిన రిజ్విపై చర్య తీసుకోమని ప్రభుత్వానికి సిఫారసు చేసినా పట్టించుకోకుండా ఎలా వీఆర్‌ఎస్ ఇస్తారని మంత్రి జూపల్లి ప్రభుత్వాన్నే ప్రశ్నించడం విశేషం. ఈ వివాదం వల్ల ప్రభుత్వ పనుల్లో సీఎం, మంత్రులు, వారి కుటుంబ సభ్యుల జోక్యం వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారన్న చర్చ సాగుతోంది. టెండర్లలో సీఎం- మంత్రుల జోక్యం అనే ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఇది ప్రతిపక్షాలకు కాంగ్రెస్ సర్కార్‌పై దాడి చేసేందుకు పదునైన అస్త్రంగా మారింది. మరో వైపు మంత్రి జూపల్లి సైతం ఆయా శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెప్పించుకుంటున్నారని సచివాలయంలో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితి కాంగ్రెస్ హై కమాండ్‌కు చిక్కులు తెచ్చిపెడుతోందని కాంగ్రెస్ వర్గాలే చెప్పుకుంటున్నాయి.
ఇంటి పోరు నియంత్రణే హైకమాండ్ ఆలోచన
గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన పార్టీలో నేతల మధ్య పూర్తి సమన్వయం లేదని, విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని పై ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. మంత్రుల మధ్య ఈ అంతర్గత పోరు, విమర్శలు, ఆరోపణలు ప్రతిపక్షాలకు ప్రధానాస్త్రాలుగా మారుతున్నాయి. వీటిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఇది పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. తక్షణ నష్ట నివారణకు హైకమాండ్ ప్రయత్నిస్తోంది. గొడవలు సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగమే సీఎం రేవంత్‌కు కొండా సురేఖ బహిరంగ క్షమాపణ, అడ్లూరి వివాదం విషయంలో మంత్రి పొన్నం వివరణ- విచారం వ్యక్తం చేయడం వంటివి జరిగాయి. అయితే మంత్రుల మధ్య వ్యక్తిగత ఆధిపత్య విభేదాలు ముదిరితే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవని హైకమాండ్ గ్రహించిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఈ పరిస్థితిని తమ నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించిందని, అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతల ఢిల్లీ పర్యటన అని కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితిని అదుపు చేయడం మాత్రం హైకమాండ్‌కు కత్తిమీద సాములాంటిదేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.






















