Telangana Bonalu: ఆషాఢ బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
Ashada Bonalu 2024: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జులై 7వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఆషాఢ బోనాలకు ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది.
Telangana Bonalu 2024: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ బోనాల సందడి షురూ కానుంది. మొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్‌లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు జరుగుతుంది. ఆషాడ బోనాల పండుగతో జంటనగరాలు దాదాపు నెల రోజుల పాటు కోలహలంగా మారనున్నాయి. బోనాల పండుగను ఆషాఢమాసంలో నిర్వహిస్తారు. బోనాల్లో భాగంగా.. ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. బోనాల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. జులై 7వ తేదీ నుంచి భాగ్యనగరలో బోనాల జాతర ప్రారంభం కానుంది.
బోనాల వేడుకకు ప్రభుత్వ నిధులు
జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆషాఢ బోనాలకు ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జంట నగరాల్లో ఆషాఢ బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలను నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బేగంపేటలో ఉన్న హరిత ప్లాజాలో ఈ సమీక్ష జరిగింది. ఈ ఏడాది జులై 7 నుంచి 29తేదీ వరకు అత్యంత వైభవంగా బోనాల పండుగను నిర్వహించనున్నారు.
గోల్కొండలో తొలిపూజ
ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం(జూలై 7) రోజు జంట నగరాల్లో బోనాల జాతర ప్రారంభమవుతుంది. గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలిపూజ నిర్వహిస్తారు, తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు చేపడతారు. మళ్లీ గోల్కొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహించడంతో బోనాల జాతర ముగుస్తుంది. బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం ఉండటం వల్ల ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాల్లో కళాబృందాలను తీసుకురావడంతో పాటు, లేజర్ షోలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
అధికారులపై మంత్రి సీరియస్
మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి రాని అధికారులపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ కు రాని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. లక్షల మంది హాజరయ్యే పండుగకు సంబంధించి మీటింగ్ పెడితే.. మంత్రులు, మేయర్ వస్తే అధికారులు హాజరు కారా అంటూ ప్రశ్నించారు. గోల్కొండ కోటలో తొమ్మది వారాలు బోనాలు సమర్పించే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిపారు.