Vice President Dattatreya:దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి - బీజేపీకి కాంగ్రెస్ సీఎం రేవంత్ డిమాండ్
Revanth Reddy: దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.ఇండియా కూటమి మద్దతిచ్చేలా మాట్లాడతానన్నారు.

Revanth demands that Dattatreya Vice President: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముందు విచిత్రమైన డిమాండ్ పెట్టారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలం వరకూ హర్యానా గవర్నర్ గా ఉన్న దత్తాత్రేయ కాలపరిమితి ముగియడంతో వేరే గవర్నర్ ను నియమించారు. దాంతో దత్తాత్రేయ ఖాళీ అయ్యారు. ఇప్పుడు ఆయనను రాష్ట్రపతిని చేయాలని కాంగ్రెస్ సీఎం డిమాండ్ చేస్తున్నారు. కులగణన అంశంపై కాంగ్రెస్ ఎంపీలకు ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ఆ అంశం కన్నా దత్తాత్రేయ అంశం గురించే ఆయన చేసిన వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రజల తరపున తాను మాట్లాడుతున్నానని.. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమి కూడా మద్దతిచ్చేలా తాను మాట్లాడతానని ప్రకటించారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ గుర్తించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతిగా ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో పలువురు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి కానీ.. దత్తాత్రేయ పేరు మాత్రం ఎవరూ ప్రతిపాదించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దత్తాత్రేయ పేరు వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ ప్రతిపాదన గురించి కాంగ్రెస్ హైకమాండ్ కు తెలిసే అవకాశం లేదు. కానీ.. బీసీ నాయకత్వం విషయంలో బీజేపీని ఇబ్బంది పెట్టడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా దత్తాత్రేయ పేరును ప్రతిపాదించారని అనుకోవచ్చు. బీసీ నాయకత్వాన్ని మోదీ అణచి వేస్తున్నారని గతంలో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించారని.. దత్తాత్రేయకు గవర్నర్ పదవి కాలపరిమితి ముగిసినా మరో చాన్స్ ఇవ్వలేదని అంటున్నారు.
ఇదే సమయంలో బీసీ బిల్లు గురించి కూడా రేవంత్ మాట్లాడారు. విపక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని బీసీలకు రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలియచేయాలని డిమాండ్ చేస్తున్నారు. బండారు దత్తాత్రేయ బీసీ కావడంతో ఈ డిమాండ్ ద్వారా మరోసారి రిజర్వేషన్ల ప్రస్తావన హైలెట్ చేయవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దత్తాత్రేయను రేవంత్ గౌరవిస్తారు. ఇటీవల రేవంత్ రెడ్డి దత్తాత్రేయను ఆత్మకథ పుస్తకం విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. దత్తాత్రేయను అజాతశత్రువు అని ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో సమానమని పోల్చారు.
ఉపరాష్ట్రపతి పదవిని తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి
— Telugu Reporter (@TeluguReporter_) July 23, 2025
బండారు దత్తాత్రేయని ఉపరాష్ట్రపతిని చేయాలని తెలంగాణ ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాను..
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసింది.
ఎదుగుతున్న నేతలను అణిచివేసిన పాపాన్ని బీజేపీ కడుక్కోవాలి..
ప్రధాని… pic.twitter.com/UqLtbeJPVO
బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా 2021 నుంచి 2025 వరకు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా 2019-2021 మధ్య పనిచేశారు. ఆయన 1965లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి, 1980లో బీజేపీలో అధికారికంగా చేరారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 1991, 1998, 1999, 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.





















