కోకాపేటలో ఇస్కాన్ హెరిటేజ్ టవర్ ఎప్పటికి పూర్తవుతుంది? అక్కడ రియల్ ఎస్టేట్ జోరుకి కారణం ఇదేనా!
ISKCON Hare Krishna Heritage Tower: కోకాపేట శ్రీ కృష్ణ గోశాల సమీపంలో నిర్మిస్తున్న ఇస్కాన్ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం ఎంతవరకూ వచ్చింది? 2023లో మొదలైన ఈ టవర్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది?

Hare Krishna Heritage Tower: హైదరాబాద్ కోకాపేటలోని శ్రీ కృష్ణ గోశాల సమీపంలో నిర్మితమవుతోంది ఇస్కాన్ హరే కృష్ణ హెరిటేజ్ టవర్. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక , సాంస్కృతిక ల్యాండ్‌మార్క్‌గా రూపొందుతోంది. ఈ టవర్ నార్సింగిలో 6 ఎకరాల విస్తీర్ణంలో 430 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతోంది, ఇది భారతదేశంలోని అత్యంత ఎత్తైన హెరిటేజ్ టవర్లలో ఒకటిగా గుర్తింపు పొందనుంది. ఈ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) ఆధ్వర్యంలో నిర్మితమవుతోంది. ఆలయం రెండు వైపులా 100 అడుగుల 120 అడుగుల రోడ్లపై 6 ఎకరాల స్థలంలో 400 అడుగుల ఎత్తైన ఐకానిక్ ఆకాశహర్మ్యంగా మారనుంది. దీనికి నిర్మాణ వ్యయం 200 కోట్లు అని అంచనా.
ఈ టవర్‌లో రాధా కృష్ణ, సీతా రామ లక్ష్మణ హనుమాన్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్ఫూర్తితో సంప్రదాయ రాతి శిల్పాలతో కూడిన ఆలయాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. లైబ్రరీ, మ్యూజియం, మల్టీ-విజన్ థియేటర్, సాంస్కృతిక విద్యా కేంద్రం ఇక్కడ ఉంటాయి. హోలోగ్రామ్, లేజర్ ప్రొజెక్షన్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా శ్రీ కృష్ణుని లీలలను ఆకర్షణీయంగా ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇతర సౌకర్యాల విషయానికొస్తే 500 మంది సామర్థ్యం ఉన్న అన్నదాన హాల్, 100 గదుల గెస్ట్ హౌస్, ఆడిటోరియం, ఓపెన్ ఎయిర్ థియేటర్, కల్యాణ మండపం నిర్మిస్తున్నారు.

ఈ టవర్ కోకాపేటలోని శ్రీ కృష్ణ గోశాల సమీపంలో, నర్సింగిలో గోష్పాద క్షేత్రంలో నిర్మితమవుతోంది..ఇది గోవులు మేసే పవిత్రభూమిగా పరిగణిస్తారు.కాకతీయ, చాళుక్య, ద్రవిడ సహా ఇతర పురాతన శైలులను పరిశీలించి సాంప్రదాయ , ఆధునిక శైలుల సమ్మేళనంగా ఈ టవర్ నిర్మిస్తున్నారు. ఇన్ని కోట్లు వ్యయం వెచ్చించి నిర్మిస్తున్న ఈ టవర్ ప్రాముఖ్యత ఏంటంటే.. తెలంగాణలో సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ పైనా చూపిస్తుంది. కోకాపేట, షంషాబాద్, తుక్కుగూడ, మరియు మహేశ్వరం ప్రాంతాల్లో భూములు, ఆస్తుల విలువ భారీగా పెరుగుతుందని అంచనా.
ఎప్పుడు మొదలైంది - ఎప్పటికి పూర్తవుతుంది
2023 మే 8న అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం 25 కోట్ల నిథులు కూడా ప్రకటించారు. 2024 ఆగస్టు 26న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం నిర్మాణం జోరందుకున్న ఈ టవర్ మరో ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు...కానీ దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
ఇస్కాన్ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పూర్తైతే హైదరాబాద్‌ను ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది. పర్యాటక రంగంలో హైదరాబాద్ ఆకర్షణను మరింత పెంచనుంది. మూడేళ్లుగా కోకాపేట నివాస, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లు, ఐటీ పార్కులు, మాల్స్, పాఠశాలలు, ఆసుపత్రులు , హోటళ్ల నిర్మాణంతో ఊహించని స్థాయిలో ఆధునీకరణ చెందింది. ఇప్పుడు ఇస్కాన్ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ లో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా మారనుంది.
View this post on Instagram






















