Konijeti Rosaiah: ముగిసిన రోశయ్య అంత్యక్రియలు.. కొంపల్లి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు పూర్తి
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం కొంపల్లిలోని ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఆదివారం ఉదయం రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన స్వగృహం నుంచి గాంధీభవన్‌కు తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తరఫున రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రోశయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర కొనసాగించి... కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు.
Also Read: పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి.. రోశయ్య మృతిపై కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం
వృద్ధాప్య కారణంగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య శనివారం కన్నుమూశారు. శనివారం ఉదయం లోబీపీ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లుగా గుర్తిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా ఆయన చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆరోగ్య పరమైన సమస్యలతో ఆయన ఇటీవల ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: మాజీ గవర్నర్ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
వైఎస్ అనంతరం రోశయ్యకు బాధ్యతలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రోశయ్యను హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. ఆ తర్వాత పార్టీలో ఏర్పడిన పరిణామాలతో తాను పదవిలో కొనసాగలేనని ఆయన వైదొలిగారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. సీఎంగా పదవి నుంచి వైదొలిగిన తరవాత రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. పదవి కాలం పూర్తయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read: జిల్లాపై చంద్రబాబు ఫోకస్.. టీడీపీ నేతల పనితీరుపై అధినేత ఆగ్రహం.. లెక్కలు తేల్చేందుకు రెడీ!





















