Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే రోశయ్య తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
LIVE

Background
రోశయ్య వంటి నేత రాజకీయాల్లో అరుదుగా ఉంటారు.. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ
మాజీ సిఎం,గవర్నర్ రోశయ్య వంటి నేత రాజకీయాల్లో అరుదుగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత అంబికా కృష్ణ అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవమే కాకుండా, సిఎంలు మెచ్చిన మంత్రిగా రోశయ్య పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో సేవలు చేసారని, ఆయన ఆత్మకు శాంతి ,కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాందించాలని కోరారు అంబికాకృష్ణ.
స్టూడెంట్ లీడర్ నుంచి గవర్నర్ పదవి దాకా రోశయ్య ఎదిగారు.. తులసిరెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య మృతి బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లె లోని ఆయన స్వగృహంలో తులసిరెడ్డి దంపతులు రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోశయ్య మృతి బాధాకరమన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని గుర్తుచేశారు. వివాదరహితుడిగా నిలిచారన్నారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు. రోశయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు, అభిమానులకు తులసిరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రోశయ్య మరణంపై సి.హెచ్ విద్యాసాగర్ రావు దిగ్భ్రాంతి
రోశయ్య మరణంపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలకు ఓ మంచి వ్యక్తి దూరమవడం బాధాకరం అన్నారు. అసెంబ్లీలో ఇరువురు చాలా కాలం కలిసి పని చేసిన రోజులు గుర్తు చేసుకున్నారు. శాసనసభలో తమ మధ్య జరిగిన చర్చలలో ఎన్నో సందర్భాలలో నవ్వులు పూయించిన సందర్భాలున్నాయని.. వాటిని ఎన్నటికీ మరువలేను అన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని... వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రోశయ్య మరణం పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం
మాజీ సిఎం రోశయ్య మరణం పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డానన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కొన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన రాష్ట్రానికి చేసిన ఎనలేని సేవలు ప్రజలకు గుర్తుండే ఉంటాయి. రోశయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శ్రీ వేంకటేశ్వర స్వామి శాంతి కలిగించాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది.. ఏపీ సీఎం వైఎస్ జగన్
‘పెద్దలు రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’ ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం ప్రకటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

