Centre blocked IRFC loan to Telangana: మెట్రో లోన్‌ను కిషన్ రెడ్డినే ఆపేయించారు - సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Revanth Reddy slams Kishan Reddy: మెట్రో రైల్ స్వాధీనానికి అవసరమైన రుణం మంజూరైనా చివరి క్షణంలో కిషన్ రెడ్డి జోక్యంతో ఆపేశారని రేవంత్ ఆరోపించారు. మెట్రో రెండో దశకు ఎన్వోసీ ఇప్పించాలన్నారు.

CM Revanth Reddy on Hyderabad Metro Rail Phase 2: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, వివక్ష చూపించినా సరే.. 100 శాతం సొంత నిధులతో రెండో దశ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇందుకోసం కేంద్రం తక్షణమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం వెనుక కేంద్రంలోని బీజేపీ, గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు.
కేంద్రం వివక్ష.. ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ దిగ్బంధం!
మెట్రో విస్తరణ కోసం తాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్‌లను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, వైజాగ్ మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణపై మాత్రం పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. జపాన్ ఏజెన్సీ నుంచి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ. 13,600 కోట్ల తక్కువ వడ్డీ రుణాన్ని కేంద్రం ఈ రోజే విడుదల చేయాల్సి ఉన్నా, దానిని సాంకేతిక కారణాలతో అడ్డుకుందని ధ్వజమెత్తారు. ఈ లోన్ ట్రాన్స్‌ఫర్ బాధ్యతను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Crux of CM Revanth Reddy press meet - Hyderabad Metro!!
— Naveena (@TheNaveena) June 15, 2026
Will IRFC release loan amount for Phase1 metro today.
Will Central govt be part of Phase2 metro? If not give us NoC, we will do it ourselves.
Will Union Minister G Kishan Reddy facilitate.? pic.twitter.com/uVnkRVcrAQ
ఎల్ అండ్ టీ మెట్రోను టేకోవర్ చేసిన ప్రభుత్వం
మొదటి దశ మెట్రోను నడుపుతున్న ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాల కారణంగా రెండో దశ విస్తరణకు చేతులెత్తేసిందని సీఎం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే, ఎల్ అండ్ టీకి చెందిన రూ. 30,000 కోట్ల విలువైన మెట్రో ఆస్తులను కేవలం రూ. 15,000 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఎల్ అండ్ టీకి ఉన్న 8.25% అధిక వడ్డీ బ్యాంక్ రుణాలను తీర్చడానికే తాము జపాన్ సంస్థ నుంచి 4% వడ్డీతో ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా లోన్ అరేంజ్ చేశామని, ఆర్బీఐ అనుమతి పత్రం ఇచ్చినా కేంద్రం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు.
కేసీఆర్ పాపమే మెట్రో నష్టాలకు కారణం!
తెలంగాణ వచ్చిన కొత్తలో నాటి సీఎం కేసీఆర్ చారిత్రక కట్టడాల పరిరక్షణ పేరుతో మెట్రో మొదటి దశ పనులను మూడేళ్ల పాటు అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దీనివల్ల రూ. 15,000 కోట్ల ప్రాజెక్టు వ్యయం కాస్తా రూ. 22,000 కోట్లకు పెరిగిపోయి, ఎల్ అండ్ టీ సంస్థ నిండా మునిగిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేవలం సంపదను కూడబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టారు తప్ప, మెట్రో విస్తరణను పూర్తిగా గాలికొదిలేశారని.. అందుకే ఒకప్పుడు టాప్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రో ర్యాంకింగ్ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హయాంలోనే పునాది.. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌పైనా ఒత్తిడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిల హయాంలోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి మెట్రో ప్రాజెక్ట్ మంజూరైందని, రోశయ్య కాలంలో ఒప్పందాలు పూర్తయ్యాయని సీఎం గుర్తుచేశారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ కలిసి లోపాయికారీ రాజకీయాలు చేస్తూ మెట్రో పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని, వారి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. మెట్రోతో పాటు వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేయాలని తాను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కూడా కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















