Traffic Volunteers: ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు! - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Telangana News: నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలన్నారు.
Transgenders As Traffic Volunteers: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను (Transgenders) వాలంటీర్స్‌గా ఉపయోగించుకోవాలని.. హోంగార్డ్స్ తరహాలోనే వారికి కూడా ఉపాధి కల్పించాలని అన్నారు. నగరంలో ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్, ట్రాఫిక్ అంశాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా సేవలందించేందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల వివరాలు సేకరించాలని.. వారి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. అటు, ఆర్అండ్‌బీ టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15 రోజుల్లోగా అందించాలని ఆదేశించారు. తప్పుడు నివేదికలిస్తే అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.