రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు: కేటీఆర్ పై తీవ్ర విమర్శలు.. అసెంబ్లీకి రమ్మని సవాల్!
CM Revanth Reddy : జల ఒప్పందాలపై ఫామ్‌హౌస్‌లో చర్చకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తనను క్లబ్‌లు, పబ్‌లకు పిలవొద్దని కేటీఆర్‌కు సెటైర్ వేశారు.

CM Revanth Reddy On KTR : కృష్ణా, గోదావరి జల అంశాలపై చట్టసభల్లో చర్చకు రావాలని సూచించాం కానీ.. వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్ లో బనకచర్ల అంశంపై ప్రజాప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని సూచించాం కానీ సవాల్ చేయలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామన్నానని చెప్పానన్నారు. కానీ ఒకాయన ప్రెస్ క్లబ్ కు వెళ్లి చర్చకు రమ్మని సవాల్ చేశారని ఇకనైనా వీధులు, పబ్బులు, క్లబ్బులు కాకుండా చట్టసభల్లో చర్చకు రావాలన్నారు. తనను సవాల్ చేసిన వ్యక్తి పేరు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదని కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిచారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి ఆరోగ్యం సహకరించకపోతే.. ఫామ్ హౌస్‌లో చర్చ పెట్టినా సిద్ధమేనని తెలిపారు. తాను మంత్రులను పంపిస్తానని.. వారి సీనియారిటీ సరిపోదంటే తాను కూడా వస్తానన్నారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహానికి వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు సీమాంధ్ర నేతలు చేసిన ద్రోహం కంటే కేసీఆర్ చేసిన ద్రోహమే ఎక్కువన్నారు. ఆంధ్రోళ్ల పాలెగాడులా కేసీఆర్ మారాడని.. ఈ అంశంపై చర్చిద్దామని అసెంబ్లీకి రావాలని పిలిస్తే రావడం లేదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం పెట్టి వచ్చారని రేవంత్ గుర్తు చేశారు. బేసిన్లు, భేషజాలు లేవంటూ..గోదావరి నీళ్లు రాయలసీమకు తరలించుకుపోవాలని జగన్ కు సలహా ఇచ్చారన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని కేసీఆర్ మరణ శాసనం రాశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల్లోతెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నారని .. నీటి పారుదల శాఖకు ఆయన కుటుంబంలోని వారే మంత్రులుగా ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కృష్ణా రాష్ట్రంలోకి ప్రవేశించిన చోటే.. ఒడిసి పుట్టుకోవాల్సిందన్నారు. జూరాల నుంచి నీటిని తెచ్చుకునేలా చేసి ఉంటే మరోలా ఉండేదన్నారు. ఆనాడు చిన్నారెడ్డి జూరాల విషయం చెబితే నిండు సభలో కేసీఆర్ అవమానించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఆంధ్రా వాళ్లు శ్రీశైలం వెనుక నుంచే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తోడేస్తున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు ఇప్పటికీ నీటి కేటాయింపులు లేవని.. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ మాట్లాడుతోందని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్‌లో ఉన్న ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. చేవేళ్ల పేరు పెట్టి నీళ్లు ఇవ్వకపోతే నిలదీస్తారని పేరు మార్చారు. 11 ఏఐబీపీ ప్రాజెక్టులను కేసీఆర్ ముట్టుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికే కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శఇంచారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికే కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్ రేపుతున్నారన్నారు.





















