Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Telangana : ప్రజలు చెబితే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఆపేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. మూసీ ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలన్నింటికీ ప్రత్యేక మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.
CM Revanth announced that he will stop the Musi revival project if the people say No : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న్ వారంతా మూడు నెలల పాటు మూసీ ప్రాంతంలో ఉండి ఆ తర్వాత మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈ ప్రాజెక్టు వద్దని ప్రజలు చెబితే తాము ఆపేస్తామన్నారు. మూసి విషయాన్ని హైదరాబాద్ మాత్రమే కాదు నల్లగొండ కూడా తాగుతోందన్నారు. సెక్రటేరియట్‌లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు.
10 నెలలుగా నిద్రాహారాలు మాని మూసీపై అధ్యయనం
మూసీ పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పనిచేసిందిని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారించామని తెలిపారు. నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు.. అలాంటి హైదరాబాద్ నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం.. మూసీ విషయంలో చరిత్ర హీనులుగా మిగలకూడదని మంచి ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. నదీగర్భంలో నివసిస్తున్న వారిపై ఆరు నెలల నుంచి అధికారులు సర్వే చేశారు. 1600 ఇళ్లు నదీగర్భంలో ఉన్నాయన్నారు.
వరదలు వస్తే ఆ నీరంతా ఎటు వెళ్లాలి ?
వరదలు వచ్చి, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టడం లేదా .. రోడ్లపై పడిన వర్షపునీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా అలాగే రోడ్లపై ఉండాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ విషం హైదరాబాద్లోనే కాదని, నల్లగొండలోనూ పారుతోందన్నారు. రదలు వచ్చి నగరం మునిగిపోతే అప్పటికప్పుడు ఏమీ చేయలేమన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే మూసీ ప్రాజెక్ట్ పునర్జీవన కార్యక్రమం చేపట్టామని అన్నారు. 10 నెలలుగా నిద్రాహారాలు మాని అధికారులు మూసీపై పని చేశారని.. మొత్తం 33 బృందాలు మూసీపై అధ్యయనం చేశాయని తెలిపారు.
ఎక్కడా చర్చకు సవాల్ - సెక్యూరి్టీ లేకుండా వస్తా!
అభివృద్ధిని ఎవరో ఒకరు వ్యతిరేకిస్తూనే ఉంటారు.. అధికారం కోల్పోయిన వాళ్లు ప్రతిదీ అడ్డుకోవాలని చూస్తున్నారని రేవంత్ విమర్శించారు. అధికారులు, మంత్రుల ముసుగులో దోచుకున్న బందిపోటు దొంగలు వాళ్లని మండిపడ్డారు. అలాంటి వాళ్లు మూసీని అడ్డుకుంటున్నారు.. యూట్యూబ్‌లతో అధికారం వస్తుందని అనుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, మీ నియోజకవర్గానికే వస్తా.. రచ్చబండ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా వస్తానన్నారు. మూసి ప్రక్షాళన వద్దని ప్రజలు చెబితే ఆపేస్తామన్నారు.
అసెంబ్లీలో చర్చిద్దాం రండి !
మూసీపై అఖిలపక్ష సమావేశం పెట్టాలనుకున్నామని అయితే దాని కంటే అసెంబ్లీ పెద్దది కాబట్టి అసెంబ్లీలో చర్చించడానకి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చర్చిద్దామన్నారు. ఇది సవాల్ కోసం కాదని సలహాలు, సూచనలు కోసమన్నారు. అసెంబ్లీలో మీకున్న అనుమానాలు బయట పెట్టాలని తాను సమాధానం చెబుతానన్నారు.
ముగ్గురు కాంగ్రెస్ ప్రధానుల వల్లే దేశాభివృద్ధి
ప్రపంచంలో ఎక్కడ మేధావులు అవసరమైనా దేశం నుంచే ఎగుమతి చేస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ వల్లే ఇది సాధ్యమైంది.. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ కారణం.. కంప్యూటర్‌తో ఉద్యోగాలు, ఆదాయాలు పెరిగాయి.. కాంగ్రెస్ విజన్‌తోనే దేశం ముందడుగు వేసింది.. అప్పటి ప్రధాని పీవీ సరళీకృత విధానాలతో ప్రపంచంలోని దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి.. నెహ్రూ, రాజీవ్, పీవీ.. ముగ్గురు ప్రధానుల వల్ల దేశం అభివృద్ధి బాటలో నడిచింది. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లారు. మాజీ ప్రధాని నెహ్రూ నుంచి రాజీవ్ వరకూ గొప్ప విధానాలు తెచ్చారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పెట్టుబడిలో సరళీకృత విధానాలు తెచ్చారు. మన బడ్జెట్ లక్షల కోట్లకు తీసుకురావడం వెనక ఆయన కృషి ఉందని రేవంత్ తెలిపారు.