KCR Dalit Plan : కేసీఆర్ కేబినెట్‌లోకి ఇద్దరు దళిత మంత్రులు.. డిప్యూటీ సీఎం కూడా..!?
దళితులకు దళిత బంధు పథకంతో పాటు వారికి రాజ్యాధికారం కూడా కల్పించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. రెండు మంత్రి పదవులను ఆ వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
హుజూరాబాద్ ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికలనూ టార్గెట్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నారన్న ప్రచారం తెలంగాణ భవన్‌లో విస్తృతంగా జరుగుతోంది. ప్రస్తుతం దళిత వర్గాలను ఆకట్టుకునే మిషన్‌ను చాలా చురుకుగా అమలు చేస్తున్న కేసీఆర్.. మంత్రివర్గంలోనూ ఇద్దరు దళితులకు చోటు కల్పించాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికలకు ముందే కేబినెట్‌లో మార్పులు చేర్పులకు కసరత్తు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రివర్గంలోకి ఇద్దరు దళిత మంత్రుల్ని చేర్చుకుంటారని టీఆర్ఎస్‌లో ప్రచారం..!
దళిత వర్గాలను ఏకపక్షంగా టీఆర్ఎస్ మద్దతుదారులుగా మార్చుకునేందుకు దళిత బంధు లాంటి పథకాన్ని ఇప్పటికే కేసీఆర్ అమలు చేయడం ప్రారంభించారు. వారికి రాజకీయంగానూ ప్రాధాన్యం కల్పించి... ఇతరుల వైపు చూడకుండా చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు దళితులకు రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీ పెట్టారు. ఇలాంటి సమయంలో దళితుల ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఆ వర్గం వారికి ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం ఎవరూ లేరు త్వరలో దళిత ఎమ్మెల్యేకు ఆ పదవి దక్కనున్నట్లుగా తెలుస్తోంది.
యువ ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం..!
ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క ఖాళీ మాత్రమే ఉంది. ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడంతో ఏర్పడిన ఖాళీ అది. ఇద్దరు దళితులకు అదనంగా చోటు కల్పించాలంటే మరొకరికి ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ మంత్రిపై వేటు పడుతుందని కొంత కాలంగా ప్రచారం ఉంది. ఈ రెండు స్థానాలను దళిత ఎమ్మెల్యేలకు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే కాబోయే మంత్రులంటూ ముగ్గురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వారంతా కేటీఆర్‌కు సన్నిహితులైన యువ ఎమ్మెల్యేలు. యువత గురించి కేసీఆర్ ఇటీవల ఎక్కువగా మాట్లాడుతున్నారు. యువ దళిత ఎమ్మెల్యేలకే ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారనేదానికి అదే సూచిక అని చెబుతున్నారు.
దళిత బంధు చైర్మన్‌గా మోత్కుపల్లికి చాన్స్..?
మరో వైపు దళిత బంధు అమలుపై ఆ వర్గంలో ఎలాంటి అనుమానాలు రాకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఆ పథకానికి చట్టబద్ధత కల్పించి... దళిత బంధు చైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులును నియమిచాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు అనధికారిక సమాచారం ఇచ్చాయి. మోత్కుపల్లి నర్సింహులు అధికారికంగా ఇంకా టీఆర్ఎస్‌లో చేరలేదు. టీఆర్ఎస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అప్పట్నుంచి హుజూరాబాద్‌లో ఈటలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆయన చెబుతున్నారు.
శరవేగంగా కీలక నిర్ణయాలు..!
తెలంగాణలో దళిత వర్గాల ఓట్లు 18శాతం వరకూ ఉన్నాయి. అందుకే దళితుకు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తూ వస్తాయి. కేసీఆర్ కూడా మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు తొలిగా తాటికొండ రాజయ్యకు.. ఆ తర్వాత కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఈ సారి మాత్రం ఎవరికీ చాన్సివ్వలేదు. ఆ లోటును మారిన రాజకీయ సమీకరణాలతో తీర్చే అవకాశం కనిపిస్తోంది.