KCR On Nagarjuna Sagar Project: గంటలోనే ఊహించనంత వరద ప్రవాహం.. కేసీఆర్ ఆదేశం.. తెరుచుకోనున్న సాగర్ గేట్లు
ఉదయం 5 గంటల వరకు 3 లక్షల 56 వేల 859 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం.. కేవలం గంట వ్యవధిలోనే భారీ స్థాయిలో పెరిగింది. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది.
కృష్ణా నదిలో ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు ప్రవాహ తాకిడి పెరుగుతోంది. దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) నుంచి కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లుగా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు నాగార్జున సాగర్‌కు 5 లక్షల 17 వేల 965 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో నమోదైంది. ఉదయం 5 గంటల వరకు 3 లక్షల 56 వేల 859 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం.. కేవలం గంట వ్యవధిలోనే భారీ స్థాయిలో పెరిగింది. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. జలాశయం 590 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గాను 579.20 అడుగుల మేర నీరు ఉంది.
జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36 వేల 543 క్యూసెక్కులు, ఎస్ఎల్‌బీసీకి 12 వందల క్యూసెక్కులు మొత్తంగా.. 37 వేల 743 క్యూసెక్కుల నీటిని దిగువకు వెళ్తోంది. నాగార్జున సాగర్ జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారుల సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు రిజర్వాయర్ క్రస్ట్ గేట్లను పరిశీలించారు. సాయంత్రం ఆరు గంటలకు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు తెలిపారు.
మధ్యాహ్నం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రి వర్గం భేటీ కానుంది. ఇందులో దళిత బంధు విధివిధానాలు ఖరారు చేయనున్నారు. ఈ అంశమే ప్రధానంగా చర్చ సాగే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నది యాజమాన్యాల బోర్డుల పరిధిని కూడా ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌పై మంత్రులు చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వర్షాలు, వరద నిర్వహణ బృందం ఏర్పాటు, పంటలకు సాగు నీరు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, దళిత బీమా, చేనేత బీమాపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఉండడంతో రాజకీయ అంశాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చిస్తారని సమాచారం.
అంతేకాక, తెలంగాణలో ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ గుర్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు, కొత్త కేసులు కాస్త పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కరోనా మూడో వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు, పడకలను అందుబాటులో ఉంచడంపై కూడా కేబినెట్ చర్చించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల లెక్కలను మంత్రివర్గం ముందు ఆర్థిక శాఖ ఉంచనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ ఫామ్ సాగుపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.