CM KCR: 'తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామరక్ష' - కాంగ్రెస్ నేతలకు సిగ్గుండదా? అంటూ కేసీఆర్ విమర్శలు
CM KCR: తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని, రాష్ట్ర హక్కులను కాపాడేది గులాబీ పార్టీయేనని సీఎం కేసీఆర్ అన్నారు. కోదాడ సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని, తమ హయాంలో రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూ లేవని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని అన్నారు. తాను మట్లాడేంత వరకూ మనకు రావాల్సిన నీటి హక్కుల గురించి కూడా ఎవరూ మాట్లాడలేదని, పంట పొలాలకు సంపూర్ణంగా నీరందించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
'బీసీల చైతన్యం చూపించాలి'
'బీసీల చైతన్యం చూపించాల్సిన బాధ్యత కోదాడ ప్రజలపై ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ ను గెలిపించాల్సిన బాధ్యత బీసీలపై ఉంది. గతంలో కోదాడ నుంచి హాలియా వరకూ పాదయాత్ర చేశాను. ఆ సమయంలో కాలువలకు నీళ్లు రాక ఇబ్బంది పడేవారు. కాళేశ్వరం నీళ్లు రాలేదని భట్టి చెబుతున్నారు. కోదాడకు మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మొద్దు. రైతు బంధు వృథా అని ఆ పార్టీ నేత ఉత్తమ్ అంటున్నారు. వారు అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారు. అది తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తాయి.?. బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తే రైతు బంధు రూ.16 వేలకు పెంచుతాం. కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తాం.' అని కేసీఆర్ తెలిపారు.
'కాంగ్రెస్ నేతలకు సిగ్గుండదా?'
అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ నేతలకు సిగ్గుండదా.? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఇక్కడకు కాళేశ్వరం నీళ్లు రాలేదని భట్టి అన్నాడని, మరి ఇవాళ మునగాల, నడిగూడెం, మోతె మండలాలకు నీళ్లు వచ్చాయా లేదా అనేది ప్రజలు చెప్పాలని అన్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టును అనుసంధానించే బాధ్యత తనదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ అంటోందని, తాము మాత్రం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులు ఆపారని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఏం చేశారో అంతా తెలుసని అన్నారు. కాంగ్రెస్ హయాంలో, తమ హయాంలో అభివృద్ధిని పోల్చుకోవాలని సూచించారు. ఓటు మన భవిష్యత్తుకు అస్త్రమని, ప్రజాస్వామ్యంలో ఓటుకు మించిన శక్తి లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని, మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
తుంగతుర్తి పోరాటాల గడ్డ
కోదాడ సభ అనంతరం తుంగతుర్తి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. గతంలో ఎన్ని పోరాటాలు చేసినా, ఏ ప్రభుత్వమూ కనికరం చూపలేదని, దీంతో కరువు ఛాయలతో పంటలు లేక ప్రజలు వలస వెళ్లే దుస్థితి ఏర్పడిందన్నారు. తుంగతుర్తి పోరాటాల గడ్డ అని, దీన్ని చూస్తుంటే తనకు సంతృప్తిగా ఉందని అన్నారు. ప్రస్తుతం గోదావరి నీటితో ఈ ప్రాంతం కళకళలాడుతుందన్నారు. తెలంగాణను మించేలా పెద్ద పెద్ద రాష్ట్రాలున్నాయని, అయితే అన్నింటినీ తలదన్నేలా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
Also Read: చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గపు చర్య, ఆయనను వెంటనే విడుదల చేయాలి - తెలంగాణ స్పీకర్ పోచారం