(Source: Poll of Polls)
Chinajeeyar : కేసీఆర్‌తో ఎలాంటి వివాదాల్లేవు - మీడియా వల్లే దూరం పెరిగిందని పరోక్షంగా చెప్పిన చినజీయర్ !
మీడియా వల్లే కేసీఆర్‌తో దూరం పెరిగిందని పరోక్షంగా చినజీయర్ స్వామి చెప్పారు. అయితే కేసీఆర్‌తో ఎలాంటి వివాదాల్లేవన్నారు. శనివారం ఆయన వస్తారని ఆశిస్తున్నట్లుగా చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ( KCR ) ఎలాంటి విభేదాలు లేవని చినజీయర్ స్వామి ( China Jiyar Swamy ) ప్రకటించారు. ఇటీవల ముచ్చింతల్‌లో జరిగిన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు కేసీఆర్ హాజరు కాలేదు. ఈ కారణంగా చినజీయర్‌తో కేసీఆర్ విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై చినజీయర్ మీడియాకు వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రితో ( CM KCR ) మాకేం విభేదాలు ఉంటాయని.. ఆయన సహకారంతోనే ఇంత పెద్ద కార్యక్రమం చేశామని చినజీయర్ వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి రోజు వచ్చినప్పుడు తాను మొదటి వాలంటీర్ అని చెప్పారని గుర్తు చేశారు.
తర్వాత ఆయనకున్న కార్యక్రమాల దృష్ట్యా ఆయన రాలేకపోయారన్నారు. విభేదాలు అనే మాట సృష్టించడమే తప్పన్నారు. శనివారం జరగనున్న శాంతి కల్యాణం ( Santi Kalyanam ) కార్యక్రమానికి సీఎంను కూడా ఆహ్వానించామని వస్తారని ఆశిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించడంపైనా స్పందించారు. విపక్షాలు, స్వపక్షాలు లేవని.. ప్రజాసేవలో ఉన్న వారంతా దీనికి ఆహ్వానితులేనని ప్రకటించారు. దేవుడి సన్నిధిలో రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఆహ్వానితులేనని చివరికి ముస్లిం నాయకులను కూడా ఆహ్వానించామన్నారు. ఆహ్వాన పత్రిను అరబిక్ భాషలో కూడా ప్రింట్ చేశామని గుర్తు చేశారు. సమతామూర్తి విగ్రహాల దర్శనానికి టిక్కెట్ ధరలను ఖరారు చేయడాన్ని చినజీయర్ సమర్థించుకున్నారు. టికెట్ కాదు.. ఎంట్రీ ఫీజన్నారు ( Entry Fee ) . ఇక్కడ నియమాలు పాటించాలని గుర్తు చేసేందకు ఫీజు పెట్టామన్నారు.
శిలాఫలకం మీద కేసీఆర్ పేరు లేకపోవడంపైనా చినజీయర్ వివరణ ఇచ్చారు. మీడియా వాళ్ల కొన్ని కలిపి రాయడం వల్ల కోతులా ఉండాల్సింది ఏనుగై కూర్చుంటుందన్నారు. ప్రధాని ( PM Modi ) రావాలని నాలుగేళ్ల క్రితం నిర్ణయమైందన్నారు. ఇదే విషయం సీఎం కేసీఆర్ కూడా తెలుసని.. ప్రధాని పర్యటన సందర్భంగా ఏం చేయాలో చెప్పండి చేస్తామన్నారన్నారు. మొదట సమాచారం ఇచ్చినప్పుడు .. ఎవరెవరు పాల్గొంటారో ముందే చెప్పడం రూల్. అందుకే పాల్గొన్నవాళ్ల పేర్లే శిలాఫలకంలో పెట్టామన్నారు. అంతే తప్ప కేసీఆర్ పేరును ఉద్దేశపూర్వకంగా శిలాఫలకంపై తొలగించడం ఏమీ లేదన్నారు.
సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం అద్భుతం సృష్టించిందని చినజీయర్ అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు పాతిక వేల కరోనా కేసులు ( Corona Cases ) ఉండేవని.. రెండు రోజుల తర్వాత కేసులు రెండు వేలకు పడిపోయాయి. దీనికంటే అద్భుతం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.