Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Hyderabad News: తిరుమల లడ్డూ వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ స్పందించారు. ఇది నమ్మలేని నిజమని.. దీనిపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు.
Rangarajan Reaction On Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ (Rangarajan) స్పందించారు. ఇది భయంకరమైన, నమ్మలేని నిజమని.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. టెండరింగ్ ప్రక్రియే తప్పు అని.. నిజానిజాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలను అరికట్టవచ్చని అన్నారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు.
ఇదీ వివాదం
గత వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని.. లడ్డూ తయారీ కోసం వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపిందంటూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. జగన్ హయాంలో టీటీడీ (TTD) మహా ప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో.. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ తెలిపింది. నెయ్యి పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని.. అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైనట్లు పేర్కొంది.
అయితే, ఇలా నివేదిక బహిర్గతం చేసిన గంటల వ్యవధిలోనే టీటీడీ నలుగురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించింది. వారంలో ఈ కమిటీ తన నివేదికను బోర్డుకు సమర్పించనుంది. అటు, ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. సీఎం వ్యాఖ్యలపై వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్ చేశారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వీరి సవాల్‌ను స్వీకరిస్తూ.. తిరుపతిలోనే ఉన్నానని లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని నిలదీశారు. లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ చేశారని నివేదికలు వచ్చాయని.. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని.. ప్రజా ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఈ అంశంపై స్పందించారు. దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేవాలయాల్లోని అంశాలను పరిశీలించేందుకు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.