(Source: Poll of Polls)
Krishna Water: కృష్ణా జలాల పంపకాలపై కేంద్ర కీలక నిర్ణయం
Krishna Water: కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది కాలంగా తీవ్ర వివాదంగా మారిన కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి చర్యలు చేపట్టింది.
Krishna Water: కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది కాలంగా తీవ్ర వివాదంగా మారిన కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి చర్యలు చేపట్టింది. కృష్ణా వివాదాల పరిష్కార ట్రైబ్యునల్-2 ద్వారా కృష్ణా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి నూతన విధివిధానాల ఖరారుకు కేంద్రమంత్రి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ఏళ్లుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. 1976లో కృష్ణా వాటర్ ట్రైబ్యునల్-1 మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో మధ్య నీటిని పంపిణి చేస్తూ అవార్డు ఇచ్చింది. ఇందులో భాగంగా 811 టీఎంసీలు కేటాయింపులు చేస్తూ ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది. నీటివాటాల కేటాయింపులను పునఃపరిశీలించవచ్చని ఆర్డర్‌లో తెలిపింది. తాజా డిమాండ్లతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్-2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం పరిష్కరించేలా నీటి పంపిణీ కోసం నూతన విధి విధానాల ఖరారుకు నిర్ణయం తీసుకున్నట్లు అనురాక్ ఠాకూర్ చెప్పారు.
కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్-2 కృష్ణా నదీ జలాల్ని కేటాయించనుంది. రెండు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) ఇప్పటికే ఉన్న, నిర్మాణంలో ఉన్నవాటితో పాటు భవిష్యత్‌లో ప్రతిపాదించే ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయనుంది. ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయాలన్న తెలంగాణ డిమాండ్ ఇవాళ నెరవేరిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అనంతరం సభ్య రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు 2004లో కృష్ణావాటర్ డిస్పూట్ ట్రైబ్యునల్ -2 ఏర్పాటైంది. మార్చి 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నీటి వినియోగానికి సంబంధించి సుప్రీంకోర్టులో మహారాష్ట్ర, కర్ణాటకలపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
2013 నవంబర్ 29న నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్ నివేదిక అందించింది. దీనిపై ఏపీ సహా రాష్ట్రాల అభ్యంతరాలతో గెజిట్ ప్రచురణ కాలేదు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత 14 జూలై 2014న తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి పంపకాల విషయాన్ని తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునల్ -2 కు బదులుగా మరో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరింది. దీనిపై కేంద్రానికి ఆదేశాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 2015లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీ చేయాలని, సమస్య పరిష్కారం కావాలని కోరింది.
వాస్తవానికి ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. ఇది కేవలం ఒప్పందం మాత్రమే. తీర్పు కాదు. విభజన చట్టం కింద కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డే నీటిని పంచుతోంది. అయితే విడిపోయిన తరువాత నీటి పంపకాలు కూడా కొత్తగా చేపట్టాలని తెలంగాణ కోరింది. అంతకుముందు తీర్పుల సమయంలో తెలంగాణలేదు కాబట్టి, తెలంగాణ వాదన వినేలా కొత్త ట్రిబ్యునల్ కావాలని తెలంగాణ వాదించింది. అందుకోసం కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని 2014లో కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. లేదంటే ఉన్న ట్రిబ్యునలే కొత్తగా నీటి పంపకాలు చేయాలని డిమాండ్ చేసింది.
2021లో కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తర్వాత సోలిసిటర్ జనరల్ అభిప్రాయం తీసుకున్న కేంద్రం కృష్ణా వాటర్ వివాదాల పరిష్కార ట్రైబ్యునల్-2 రద్దు చేయడానికి బదులుగా అదనపు విధివిధానాలు చేర్చాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థకీరణలో చట్టాన్ని ఉల్లంఘించకుండా అదనపు విధివిధానాలు చేర్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై బీఆర్‌ఎస్ మినిస్టర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని ఎన్నికల స్టంట్‌గా పేర్కొన్నారు. ట్రైబ్యునల్ ఏర్పాటు పేరుతో కేంద్రం కాలయాపన చేసిందని విమర్శలు గుప్పించారు.