Medigadda Barrage: మేడిగడ్డ కుంగడానికి కారణం అదేనా? నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే!
Medigadda Barrage: పునాదుల వద్ద ఇసుక కొట్టుకుకోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌కు నష్టం వాటిల్లినట్లు కేంద్ర జల సంఘం నియమించిన కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.
Medigadda Barrage: మేడిగడ్డ కుంగడానికి కారణాలను కేంద్ర నిపుణుల కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. పునాదుల వద్ద ఇసుక కొట్టుకుకోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌కు నష్టం వాటిల్లినట్లు కేంద్ర జల సంఘం నియమించిన కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ ఆనకట్టపైన కొంతభాగం కుంగిపోవడం, ఏడో బ్లాక్‌లోని పియర్‌కు పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ అనిల్‌జైన్ ఛైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో సీడబ్ల్యూసీ కమిటీని నియమించింది.
మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కమిటీ బుధవారం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో సమావేశమైంది. అనిల్‌జైన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్(జనరల్), వెంకటేశ్వర్లు(కాళేశ్వరం), నాగేందర్‌రావు(ఓఅండ్‌ఎం), సీడబ్ల్యూసీ (హైదరాబాద్) చీఫ్ ఇంజినీర్ రంగారెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్‌పాండే, కమిటీలోని ఇతర సభ్యులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ముందుగా ప్రాజెక్టు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన వివరాలతో ప్రజంటేషన్ ఇచ్చారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిజైన్, డ్రాయింగ్స్, నాణ్యతకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఫౌండేషన్, కట్ ఆఫ్ వాల్ డిజైన్, అలైన్‌మెంట్, పనులకు సంబంధించిన నాణ్యత, థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ వివరాలపై ఆరా తీశారు. నిర్మాణ సమయంలో ట్రీట్‌మెంట్, సెడిమెంటేషన్ వివరాలు అడిగారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత దెబ్బతిన్న పియర్స్ ఉన్న బ్లాక్‌కు కాఫర్‌డ్యాం నిర్మించి మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ప్రాజెక్టుకు ఇందుకు సంబంధించిన డిజైన్స్, డ్రాయింగ్స్‌తో సహా అని వివరాలు పంపితే తాము కూడా పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. పియర్స్ కుంగిన ఏడో బ్లాకే కాకుండా బ్యారేజీ అంతా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొలతలు తీసి ఇంకెక్కడైనా ఇలాంటి సమస్య వస్తుందేమో చూడాలని, పియర్స్‌కు నెర్రెలు వచ్చిన చోట మ్యాపింగ్ చేయాలని సలహా ఇచ్చారు. ఏడో బ్లాక్‌లో ఒక పిల్లర్ నెర్రెలు ఇవ్వడంతో పాటు ఇరువైపుల ఉన్న పిల్లర్లు కూడా పరిశీలించాలని సూచించినట్లు సమాచారం.
దెబ్బతిన్న పిల్లర్ ర్యాఫ్ట్ కింద 300 మి.మీ. వరకు, మిగిలిన రెండింటి కింద 150 మి.మీ. గ్యాప్ ఉండొచ్చనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. కట్ ఆఫ్ వాల్ నుంచి పైపింగ్ ఏర్పడి పిల్లర్స్ వద్ద ర్యాఫ్ట్ కింద ఇసుక క్రమంగా మైగ్రేట్ కావడం వల్ల ఈ సమస్య ఏర్పడి ఉండొచ్చని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం 20 వేల క్యూసెక్కులకు పైగా వరద ఉన్నందున తగ్గిన తర్వాత ఈ బ్లాక్ వరకు కాఫర్ డ్యాం నిర్మించి నీటిని రాకుండా నిలిపివేసి మరింత లోతుగా పరిశీలించి అవసరమైన పనులు చేపట్టనున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి తెలియని కారణాలు కూడా ఏమైనా ఉండొచ్చని కమిటీ అభిప్రాయపడింది. నీటిని నిలిపివేసి పరిశీలించాక కచ్చితమైన కారణమేమిటన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పునాదుల కింద ఇసుక కదలడంతో పిల్లర్‌కు ఉన్న సపోర్టు పోయి కిందకు దిగడం వల్ల వంతెన కుంగిందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్, తెలంగాణ డ్యాం సేఫ్టీ కమిటీ ఛైర్మన్ ఏబీ పాండ్యా త్వరలోనే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు.