Ranjith Reddy: ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ - చేవెళ్ల ఎంపీపై కేసు నమోదు
Chevella MP Ranjith Reddy: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి.. దుర్భాషలాడారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.
Case Against Chevella MP Ranjith Reddy: చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై (Ranjith Reddy) పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డిపై (Konda Visweswara Reddy) దుర్భాషలాడిన ఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి బెదిరించారని కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు. ఈ నెల 17న ఫోన్ చేశారని.. తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావు.? సర్పంచులతో ఎందుకు మాట్లాడుతున్నావు? అంటూ అగౌరవంగా, అసభ్యకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టు ఆదేశాల మేరకు ఎంపీపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ సతీష్ తెలిపారు. కాగా, మరో 2 నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎంపీపై కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
2018లో రాజీనామా
ఇక, కొండా విశ్వేశ్వర రెడ్డి 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ పార్టీతో విభేదాల కారణంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మూడేళ్లు హస్తం పార్టీలో కొనసాగిన విశ్వేశ్వర రెడ్డి, 2021లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రస్తుతం అందులో కొనసాగుతున్నారు.
Also Read: Richest Districts: తెలంగాణలో రిచ్చెస్ట్ జిల్లాగా రంగారెడ్డి - భాగ్య నగరానికి ఎన్నో స్థానమంటే?