(Source: ECI/ABP News/ABP Majha)
Case on Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ పై కేసు నమోదైంది. చౌటుప్పల్ లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో జరిగిన వివాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని లక్కారంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా.. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
చౌటుప్పల్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెుదట ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురించి.. తనకు ముందుగా సమాచారం ఇవ్వలేదని.. ఇలా చెప్పకుండా కార్యక్రమాలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని.. ప్రశ్నించారు. నల్గొండలో జరిగిన కార్యక్రమంలో ఫ్లెక్సీపై ఎమ్మెల్యే ఫొటో పెట్టారని, ఇక్కడెందుకు లేదని అడిగారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టే.. తనపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
రాజకీయ ప్రసంగం వద్దు
అనంతరం.. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఆకలి, దారిద్య్రం, ఆత్మహత్యలను రూపుమాపామని చెప్పారు. 2014 జూన్‌కు ముందు రాష్ట్రంలో, జిల్లాలో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుచేసుకోవాలన్నారు. మంత్రి ప్రసంగం చేస్తుండగానే.. ఎమ్మెల్యే కోమటి రెడ్డి తన కుర్చీలోంచి లేచి రాజకీయ ప్రసంగం వద్దంటూ అభ్యంతరం తెలిపారు.
కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తేలేదు
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే.. జగదీశ్ రెడ్డి మంత్రి అయ్యే వారు కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కరు మాత్రమే తెలంగాణ తేలేదని.. పార్లమెంటులో ఎంపీగా పోరాటం చేశానని గుర్తు చేశారు. వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారని అన్నారు. ఈ క్రమంలోనే మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలోనుంచి మైకు లాక్కునే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వం మంచి పనులు చేయడం ఇష్టం లేక కొందరు అడ్డుకుంటున్నారంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి సభలో వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం చిల్లర నాటకాలు వద్దన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి, ప్రతి ఊరికి వస్తానన్నారు.
రెండు పార్టీల కార్యకర్తల నినాదాలు
అక్కడున్న జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, పురపాలిక ఛైర్మన్.. పలువుర ఎమ్మెల్యేను సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. ఈ వివాదం నడుస్తుండగానే.. మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలూ నినాదాలు చేశారు. మంత్రి ఆదేశించగా.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను పోలీసులు సమావేశ హాలు నుంచి బయటకు పంపించి వేశారు. అసలు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆగ్రహంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రూ.200 కోట్లు ఇచ్చారని.. జిల్లాకు కనీసం 200 కోట్లైనా తెచ్చారా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు తీసుకురాకుండా వస్తే.. ఖబడ్దార్ అని హెచ్చరించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే.., ఆయన అనుచరులపై చౌటుప్పల్ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Dalita bandhu : దళిత బంధు ఎన్నికలకు ముందా..? తర్వాతా..?