MLC ByPoll In Telangana : తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు హోరాహోరీ ప్రచారం- నేటి ముగియనున్న క్యాంపెయిన్ - సోమవారం ఎన్నిక
Telangana News: తెలంగాణలో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికల సోమవారం జరగనుంది. ఇవాళ్టితో పోలింగ్ ముగియడంతో అన్ని పార్టీలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి.
Khammam Warangal and Nalgonda News: ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పది రోజుల క్రితం లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అయినా తెలంగాణలో ఎన్నికల హడావుడి ఇంకా పోలేదు. సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పట్టు సాధించి అన్ని వర్గాల్లో తమకే ఆదరణ ఉందని చెప్పుకునేందుకు అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం ఇవాళ్టి సాయంత్రంతో ముగియనుంది. దీంతో సోమవారం జరిగే పోలింగ్‌లో ఎవరి పక్షాన పట్టభద్రులు నిలుస్తారనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
తెలంగాణలో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికల సోమవారం జరగనుంది. ఇవాళ్టితో పోలింగ్ ముగియడంతో అన్ని పార్టీలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. అందుకే పేరుకే ఎమ్మెల్సీ ఉపఎన్నిక అయినా అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం, ప్రలోభాలు సాగుతున్నట్టు టాక్ నడుస్తోంది.
ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేశారు. విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఇప్పుడు ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ తరఫున ఏనుగల రాకేష్‌రెడ్డి బరిలో ఉన్నారు.
రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన తమ స్థానాన్ని దక్కించుకునందుకు బీఆర్‌ఎస్ శాయశక్తుల పోరాడుతోంది. దీన్ని కైవశం చేసుకొని పట్టభద్రుల్లో కూడా తమకే పట్టు ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సీటు దక్కించుకుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెక్ పెట్టవచ్చనే ఆలోచన బీజేపీ ఉంది.
ఈ మూడు పార్టీల వ్యూహాలతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చాలా హీట్ పుట్టిస్తోంది. మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం కూడా అదే స్థాయిలో చేస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగడంతోపాటు ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర పేర్లతో విద్యావంతులకు చేరువ అయ్యేందుకు శ్రమించారు.
తీన్‌మార్ మల్లన తరఫున సీఎం రేవంత్ రెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున కేటీఆర్, హరీష్‌రావు సుడిగాలి పర్యటనలు చేసి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని ఆరోపించారు బీఆర్‌ఎస్ నేతలు.
బీజేపీ అభ్యర్థి తరఫున రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా కీలకమైన నేతలంతా ప్రచారం చేశారు. మోదీ పాలన, బీజేపీ విధానాలు మెచ్చి చదువుకున్న వ్యక్తిని చట్టసభలకు పంపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ఇలా మూడు పార్టీల హోరాహోరీ ప్రచారంతో జరిగే ఒక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా రాజకీయంగా కాక రేపుతోంది.