BRS Meeting in Maharashtra: మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడో భారీ బహిరంగ సభ - ఈనెల 24న!
BRS Meeting in Maharashtra: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ మూడో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది.
BRS Meeting in Maharashtra: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈ నెల 24వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఆ రాష్ట్రంలో పార్టీ విస్తరించాలని చూస్తున్న భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండు సభలను నిర్వహించారు. మూడో సభ కూడా నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ ప్రణాళికలు వేస్తోంది. ఔరంగాబాద్ లో నిర్వహించతలపెట్టిన మూడో బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీజేపీ, శివసేనతో పాటు ఎన్సీపీ, శివ సంగ్రామ్ పార్టీ, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ జాబితాలో ఉన్నారు. షెట్కారీ సంఘటన్ నేత శరద్ ప్రవీణ్ జోషి, మాజీ ఎమ్మెల్యేలు శంకరన్న డోంగె, సంగీత థోంబర్ తో పాటు వివిధ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
క్షేత్రస్థాయి నుండి బలపడటానికి ప్రణాళికలు
క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం దిశగా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు వేస్తోంది. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. లాతూర్, నాందేడ్, యవత్మాల్, చంద్రాపూర్, షోలాపూర్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, నాసిక్ జిల్లాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ లోకి చేరికలు కూడా ఈ ప్రాంతాల నుండే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ మొదటి సభ నాందేడ్ లో ఫిబ్రవరి 5వ తేదీన జరిగింది. కాంధార్-లోహాలో రెండో సభ మార్చి 6వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు మూడో సభను ఔరంగాబాద్ లో నిర్వహించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు త్వరలోనే ప్రారంభం అవుతాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఔరంగాబాద్ సభకు సంబంధించి మహారాష్ట్రలోని కన్నడ్ లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐడీసీ ఛైర్మన్ వేణుగోపాలచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే, హర్షవర్ధన్ జాదవ్, సీనియర్ నాయకులు అభయ్ కైలాస్ రావు పాటిల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఔరంగాబాద్ తర్వాత షోలాపూర్
మూడో బహిరంగ సభను ఔరంగాబాద్ లో నిర్వహించిన తర్వాత నాలుగో సభను షోలాపూర్ లో నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో షోలాపూర్ భాగమన్న సంగతి తెలిసిందే. ఇక్కడ తెలుగు ప్రజలు కూడా ఎక్కువగానే నివసిస్తుంటారు. వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూనే క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని పునాదుల నుండి బలపర్చాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీతో పాటు బీఆర్ఎస్ రైతు విభాగం మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ తదితరులు చేరికలు, పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు.