BRS Mlas: మీడియా పాయింట్ వద్దకు నో ఎంట్రీ - బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం
BRS Mlas Argument: అసెంబ్లీ నుంచి వాకౌట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
BRS Mlas Argued With Police in Assembly: తెలంగాణ అసెంబ్లీ (TRS Assembly) నుంచి వాకౌట్ అయిన బీఆర్ఎస్ సభ్యులు అనంతరం లాబీల్లో నుంచి బయటకు వచ్చేశారు. అయితే, వారు మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మార్షల్స్, పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి మరీ వారిని నిలువరించారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదనే నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. కొత్తగా ఈ రూల్స్ ఏంటంటూ హరీష్ రావు (HarishRao), కేటీఆర్ (KTR) వాదించారు. స్పీకర్ నుంచి తమకు అలాంటి నోట్ రాలేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదని.. పోలీస్ పాలన అంటూ దుయ్యబట్టారు. సభలో మైక్ ఇవ్వరు.. ఇక్కడ కూడా మాట్లాడనివ్వరా.? అంటూ నిలదీశారు. సీఎం స్థాయికి తగని విధంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని.. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందంటూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.
స్పీకర్ మౌఖిక ఆదేశాలు
మీడియా పాయింట్ లో మాట్లాడకూడదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెక్యూరిటీ అధికారి అడ్డుకున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన రూలింగ్ కానీ రాతపూర్వక ఆదేశాలు ఏమన్నా ఉంటే చూపించాలని వారు డిమాండ్ చేశారు. స్పీకర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని అసెంబ్లీ భద్రతా సిబ్బంది, పోలీసులు బీఆర్ఎస్ నేతలకు తెలిపారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, స్పీకర్ తో మాట్లాడి అనుమతి తీసుకొని చెప్తానని చెప్పిన అధికారులు.. స్పీకర్ అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ క్రమంలో వారు అడ్డుకున్న చోటే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
'ఇదేమి కంచెల పాలనా.?'
అనంతరం, బైఠాయించిన చోటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. 'అసెంబ్లీలో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నాం. చెప్పలేని భాషలో ఆయన మాట్లాడుతున్నారు. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే స్పీకర్ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. దీనిపై ప్రశ్నిద్దామంటే అసెంబ్లీలోనూ అవకాశం ఇవ్వడం లేదు. బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా.?' అంటూ కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా.. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడవద్దనే నిబంధన ఏదీ లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తాను కూడా శాసనసభా వ్యవహారాల మంత్రిగా చేశానని.. ప్రభుత్వం కావాలనే ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని మండిపడ్డారు.
Also Read: CM Revanth Reddy: 'చచ్చిన పామును ఎవరైనా చంపుతారా?'- కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం