CM Revanth Reddy: 'చచ్చిన పామును ఎవరైనా చంపుతారా?'- కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదనలు సాగాయి. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy Comments on KCR in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా సీఎం అభ్యంతర కర భాష వాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు లేవనెత్తగా.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ (KCR) వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి భాష వాడొచ్చా అంటూ ప్రశ్నించారు. ఓ సీఎంను పట్టుకుని 'ఏం పీకనీకి పోయారా.?' అని అంటారా అంటూ నిలదీశారు. ఇదేనా తెలంగాణ సంప్రదాయం.. ఇది పద్ధతా.? అని మండిపడ్డారు. 'తెలంగాణ సమాజం పట్ల, రైతుల పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డకు వచ్చేది. పదే పదే బీఆరెస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారు. మాజీ సీఎం నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా?. మేడిగడ్డ కుంగిపోతే.. అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా?, కడియం శ్రీహరి, హరీష్ లకే పెత్తనం ఇస్తాం.. నీళ్లు నింపి చూపించండి. చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష నేతను అసెంబ్లీకి రమ్మనండి. కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు మేం సిద్ధం.' అని స్పష్టం చేశారు.
'చచ్చిన పామును ఎవరైనా చంపుతారా.?'
బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని.. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయిందని.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫ్యాంట్ ఊడదీశారు. ఇప్పుడు చొక్కా లాగుతారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేడిగడ్డలో కూలింది రెండు పిల్లర్లే అయితే.. వాటి మీదైనా మాట్లాడేందుకు కేసీఆర్ సభకు రావాలి. గురువారం సాయంత్రం వరకైనా కేసీఆర్ సభకు వస్తే చర్చిద్దాం. అవసరమైతే సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేతపత్రం విడుదల చేస్తాం. ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి. అవినీతి బయటపడుతుందనే సభకు రాకుండా పారిపోయారు.' అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన భాష సరికాదంటూ సీఎం తీరను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, కృష్ణా, గోదావరి జలాలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ కు ఆసక్తి లేదని.. అందుకే సభ నుంచి వెళ్లిపోయారంటూ కాంగ్రెస్ సభ్యులు అన్నారు.
'అందరికీ ఛాన్స్ ఇవ్వండి'
అంతకు ముందు కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలని కేటీఆర్ అన్నారు. వాళ్లు 64 మంది ఉన్నారని.. తాము 39 మంది ఉన్నామని అధికార పక్షం అడిగిన వెంటనే మైక్ కట్ చేయడం సరికాదని అన్నారు. కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. సభ్యులందరినీ ఒకేలా చూడాలని స్పీకర్ ను ఉద్దేశించి అన్నారు.
'మేం చర్చకు సిద్ధం'
అటు, కృష్ణా, గోదావరి జలాలపై శ్వేతపత్రంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. సీఎం రేవంత్ వాడే భాషపైనే తమకు అభ్యంతరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 'రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. సీఎంగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా నిండు సభలో సహనం కోల్పోతే ఎలా.?. సీఎం వాడరాని భాష వాడితే సరికాదు.' అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొని వాదోపవాదనలకు దారి తీసింది.