BRS Lodges Complaint: రాహుల్ గాంధీ, కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
Telangana News: బీఆర్ఎస్ పార్టీపై, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై వ్యక్తిగత విమర్శలు, నిరాధారమైన ఆరోపణలు చేశారని రాహుల్ గాంధీ, కొండా సురేఖలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.
![BRS Lodges Complaint: రాహుల్ గాంధీ, కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ BRS lodges complaint against Rahul Gandhi and Konda Surekha BRS Lodges Complaint: రాహుల్ గాంధీ, కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/cc994631a03acaa8f82e3783e117e8901712594767733233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BRS lodges complaint against Rahul Gandhi and Konda Surekha: హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై, నిరాధార ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI)కి ఫిర్యాదు చేశారు. తుక్కు గూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభలో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంఛార్జి దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.
రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదు
మార్చి 16న దేశ వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. కానీ తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్ పార్టీపై, మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ ఈసీకి రాసిన ఫిర్యాదులో లేఖలో పేర్కొన్నారు. ఎంసీసీ ప్రకారం.. ఏ వ్యక్తి, నేతగానీ మరో వ్యక్తి లేక నేత వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయకూడదు. ఆధారాలు లేని విషయాలలో సైతం ఆరోపణలు, విమర్శలు చేయకూడదని ఎలక్షన్ కోడ్ చెబుతుండగా... రాహుల్ గాంధీ వాటిని ఉల్లంఘించి కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు చేశారని లేఖలో పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం దుమారం రేపుతోంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ.. తనపై కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)