Danam Nagendar: దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ - స్పీకర్ కు సమర్పించిన బీఆర్ఎస్ నేతలు
Telangana News: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు.
Brs Leaders Complaint Against Danam Nagendar To Speaker: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు. సోమవారం హైదరాబాద్ హైదర్ గూడలోని స్పీకర్ నివాసంలో ఆయన్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, బండారు లక్ష్మారెడ్డి.. దానంపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించారు.
వాస్తవానికి ఆదివారం సాయంత్రమే స్పీకర్ ను కలవాలని వారు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. నిర్ధేశిత సమయానికి స్పీకర్ నివాసానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని చెప్పారు. తాము ఎదురుచూస్తున్నామని.. పలుమార్లు ఫోన్ చేసినా స్పీకర్ స్పందించలేదని వాపోయారు. ముందు అపాయింట్ మెంట్ ఇచ్చి కలవకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్ ఒత్తిడితోనే తమను స్పీకర్ కలవలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ కు వరుస షాక్ లు
అటు, లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఆదివారం బీఆర్ఎస్ కీలక నేతలు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్జి (Ranjith Reddy), ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ.. వారికి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఆదివారం ఉదయమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవలే దానం నాగేందర్ సీఎం రేవంత్ ను కలిశారు. పార్టీ మారేది లేదని చెబుతూనే.. హస్తం గూటికి చేరారు. దీంతో ఆయన వైఖరిపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనపై స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
పోటీపై దానం క్లారిటీ
పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా దానం నాగేందర్ పోటీ చేస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఈ కారణంతోనే లోక్‌సభ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ హస్తం పార్టీలో చేరారనే ప్రచారం సాగగా.. ఈ వార్తలపై దానం నాగేందర్ స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం లేదని, మీడియాతో జరిగే ప్రచారం అవాస్తవమని దానం నాగేందర్ స్పష్టం చేశారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. మరోసారి సికింద్రాబాద్ నుంచి బీజేపీ తరపున కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఇక బీఆర్ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌కు టికెట్ ఖరారైంది.
Also Read: Mlc Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ - తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడి