(Source: ECI/ABP News/ABP Majha)
BJP Candidates: 38 మందితో బీజేపీ తొలి జాబితా రెడీ! అభ్యర్థులు వీరేనా? ఎవరు ఎక్కడి నుంచి పోటీ!
38 మందితో కూడిన అభ్యర్థుల తోలి జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణలో శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు ఎంపికపై బీజేపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఏక అభిప్రాయం కుదిరిన 40 మంది తో కూడిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపించింది. ఈ జాబితాను జాతీయ నాయకత్వం పరిశీలించిన తర్వాత స్వల్ప మార్పులతో అమావాస్య తర్వాత ఈనెల 15 లేదా 16న 38 మందితో కూడిన అభ్యర్థుల తోలి జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఏక అభిప్రాయం కుదరని మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది.
అయితే బీజేపీ ప్రకటించిన 38 మందితో కూడిన తొలి జాబితాలో వీరి పేర్లు ఉన్నాయని విస్తృత ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై బీజేపీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అంబర్ పేట్ - కిషన్ రెడ్డి, ముషీరాబాద్ - బండారు విజయలక్ష్మి, సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి, ఉప్పల్ - ఎన్వి ఎస్ ఎస్ ప్రసాద్, మల్కాజ్ గిరి - రామచంద్ర రావు, ఖైరతాబాద్ - చింతల రామచందర్ రెడ్డి, గోషామహల్ - విక్రమ్ గౌడ్, మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్, కల్వకుర్తి - ఆచారి, గద్వాల - డీకే అరుణ, మహబూబ్ నగర్ - జితేందర్ రెడ్డి, తాండూరు - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం - బూర నర్సయ్య గౌడ్, కుత్బుల్లాపూర్ - శ్రీశైలం గౌడ్, భువనగిరి - గూడూరు నారాయణరెడ్డి, ఆలేరు - వెంకటేశ్వర్లు, హుజురాబాద్ - ఈటెల రాజేందర్.
కరీంనగర్ - బండి సంజయ్, చొప్పదండి - శోభ, వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రభాకర్ రావు, భూపాలపల్లి - కీర్తి రెడ్డి, వేములవాడ - చిన్నమనేని వికాస్ రావు, అదిలాబాద్ - శంకర్, బోథ్ - సోయం బాపూరావు, ఆర్మూర్ - ధర్మపురి అరవింద్, మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సూర్యాపేట - వెంకటేశ్వర్లు, పరకాల - ప్రేమేందర్ గౌడ్, దుబ్బాక - రఘునందన్ రావు, వర్ధన్నపేట - శ్రీధర్, మహబూబాబాద్ - హుస్సేన్ నాయక్, సికింద్రాబాద్ - కార్తీక్ రెడ్డి, నర్సంపేట - ప్రకాశ్ రెడ్డి, నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ - రాకేష్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ - విజయ రామారావు, రాజేంద్రనగర్ - శ్రీనివాస్ రెడ్డి వీరి పేర్లు తొలి జాబితాలో ఉన్నవి. ఆయా నియోజకవర్గంలో పార్టీ బలంతోపాటు అభ్యర్థుల బలాబలాలపై పోర్టీ కేంద్ర బృందాలు, రాష్ట్ర పార్టీ రంగంలోకి దింపిన బృందాలు సర్వేలు నిర్వహించాయి. సర్వేల ఆధారంగానే అభ్యర్థుల బలాబలాల ఆధారంగానే రెండో,మూడో విడత జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు బీజేపీ రెడీ
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయితే అమావాస్య తర్వాత బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తొలిజాబితా ప్రకటన చేశారు. ఇటీవల దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన కిషన్ రెడ్డి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సభలు, కేంద్రమంత్రుల పర్యటనలపై చర్చించారు. వచ్చే రెండు నెలల్లో అనేక మంది కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. నవంబర్ మొదటి వారంలోపు తెలంగాణలో 30 సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని కిషన్‌రెడ్డి అన్నారు.
అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.స్క్రీనింగ్ కమిటీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అభ్యర్థుల తొలి జాబితాపై రాజగోపాల్‌రెడ్డి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో బలమైన అభ్యర్థులకే చోటు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మూడు విడతల్లో 119 అసెంబ్లి స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని బీజేపీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం