Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్ షోకి కూడా ప్లాన్!
ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలు ఖరారు అయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉండడం వల్ల బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. జనాల్లో బీజేపీ ఊపు తగ్గకుండా, మరింత పెంచడానికి నిరంతరం ప్రజల్లో ప్రణాళికలు బీజేపీ వేస్తోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లగా, తాజాగా మహా జన సంపర్క్ అభియాన్ పేరిట మరోసారి బీజేపీ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇకపై వరుసగా బీజేపీ అగ్రనేతలను తెలంగాణకు తీసుకురానున్నారు.
ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలు ఖరారు అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రధాని మోదీని కూడా తెలంగాణకు ఆహ్వానించనున్నారు. మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఈ నెలలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. కర్ణాటక తరహాలోనే హైదరాబాద్ లో కూడా ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో మోదీ రోడ్ షోతో పాటు సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెబుతున్నారు. రెండు రోజుల్లో మోదీ పర్యటనకు సంబంధించి తేదీలు, స్థలాలు ఖరారు అయ్యే అవకాశం ఉందని సమాచారం.
15న ఖమ్మంకు అమిత్ షా
మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా నిర్వహించే బహిరంగ సభల్లో జేపీ నడ్డా, అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగే సభకు అమిత్ షా హాజరు కానున్నారు. అలాగే, 25న నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జరిగే బీజేపీ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా తెలంగాణలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ బన్సల్ సమీక్ష నిర్వహించారు. జూన్ 30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానిగా మోదీ తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, సాహసోపేత నిర్ణయాలు, పథకాలను ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు.