Babu Mohan : బండి సంజయ్ ఎవడ్రా ? - బాబూమోహన్ లీక్డ్ డైలాగ్స్ ఇంకా చాలా ఉన్నాయ్ !
బీజేపీ నేత బాబూమోహన్ సొంత పార్టీ నేతలపై బూతులతో విరుచుకుపడ్డారు. ఈ ఆడియో వైరల్ అయింది.
Babu Mohan : బీజేపీ నేత , సినీ నటుడు బాబూమోహన్ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. మీతో కలిసి పని చేస్తానంటూ ఓ కార్యకర్త బాబూమోహన్ కు ఫోన్ చేశారు. అయితే తాను ప్రపంచ స్థాయి నేతనని తనకు అలా ఫోన్ చేయడం ఏమిటని బాబూమోహన్ ఫీలయ్యారు. వెంటనే నోటికి పని చెప్పారు. ఆందోల్ నుంచి వెంకట రమణ అనే ఓ బీజేపీ కార్యకర్త బాబూమోహన్ కు ఫోన్ చేసి సార్ నేను మీతో కలిసి పార్టీ కోసం పనిచేద్దామనుకుంటున్నాను అన్నారు. దీంతో నువ్వెంత నీ బతుకెంత నాతో కలిసి పనిచేస్తావా? నేనెవరు నీకు తెలుసా? నేను ప్రపంచ స్థాయి నాయకుడిని..అటువంటి నాతో కలిసి పనిచేస్తావా? నువ్వెంత నీ బతుకెంత? మరోసారి ఫోన్ చేశావంటే చెప్పుతో కొడతా అంటూ రెచ్చిపోయారు.
బండి సంజయ్ ఎవడ్రా .. వాడు నా తమ్ముడు అంటూ నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. మధ్య మధ్యలో అశ్లీల పదజాలంతో ఘాటుగా మాట్లాడారు. బీజేపీ కార్యకర్తపై బాబూమోహన్ చేసిన బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆదోల్ ను అభివృద్ధి చేశా..నువ్వంతరా బచ్చాగాడివి నాకే ఫోన్ చేసి నాతో కలిసి పనిచేస్తానంటావా? అంటూ ఇష్టానురీతిగా రెచ్చిపోయారు బాబూమోహన్. పార్టీలో నేను కష్టపడి పనిచేశాను అందుకు అమిత్ షా అంతటి నేతే నన్ను బీజేపీలో చేర్చుకున్నారు అంటూ తన దర్పాన్ని ప్రదర్శించారు. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ కార్యకర్తను హెచ్చరించారు.
బాబూ మోహన్ బీజేపీలోనే ఉన్నా ఎక్కడా యాక్టివ్ గా లేరు.కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా బాబూ మోహన్ పేరు వినిపించటంలేదు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యం దక్కడం లేదని తెలుస్తోంది. అదే సమయంలో బాబూమోహన్ కూడా ఆందోల్ నియోజకవర్గంలో కనిపించడం తక్కువైంది. ఆయన పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. పైగా ఇలా ఫోన్లు చేసిన వారిపై బూతులతో విరుచుకుపడుతున్నారు. మామూలుగానే బాబూ మోహన్ ది వివాదాస్పద ప్రవర్తన. ఆయన తీరుపై గతంలోనూ పలుమార్లు వివాదాలొచ్చాయి. తాజాగా బీజేపీలోనూ ఆయన తీరు అంతే ఉంది.
అందోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబూమోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి గెలిచారు. కానీ 2018 ముందస్తు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ టిక్కెట్ నిరాకరించిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. ఆయన తర్వాత బీజేపీలో చేరి ఆందోల్ నుంచే పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కనీసం రెండు వేల ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. కానీ బీజేపీలో పెద్ద యాక్టివ్ గా లేకపోయినా తాను మాత్రం ప్రపంచ స్థాయి నేతను అని చెప్పుకుంటూ ఓ సాధారణ కార్యకర్తపై బూతుల పురాణం అందుకోవటం సంచలనంగా మారింది.