Babu Mohan: ఎన్నికల వేళ టీ బీజేపీకి షాక్, అసంతృప్తితో బాబు మోహన్ రాజీనామా?
Babu Mohan: సినీ నటుడు, బీజేపీ నేత బాబు మోహన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై తేల్చేశారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.
Babu Mohan: సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేత బాబు మోహన్ సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేత, పాపులర్ నేతగా ఉన్న తనకు ఇప్పటివరకు సీటు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బీజేపీ రెండు జాబితాలు ప్రకటించింది. మొదటి జాబితాలో 45 మంది పేర్లను ప్రకటించగా.. రెండో జాబితాలో మహబూబ్ నగర్ అభ్యర్థిని మాత్రమే ప్రకటించింది. తుది జాబితాలో మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. మూడో జాబితాపై కాషాయదళం కసరత్తులు చేస్తోండగా.. నవంబర్ 3న ఎన్నికల నామినేషన్లు మొదలైన తర్వాత బీజేపీ తుది జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలి రెండు జాబితాల్లో దాదాపు బీజేపీలోని ముఖ్య నేతలందరితో పాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు కూడా సీటు కన్ఫామ్ చేశారు. కానీ తనకు ఇంకా టికెట్ ఫిక్స్ చేయకపోవడంపై బాబు మోహన్ సీరియస్ అయ్యారు. తన పేరు ఎన్నో జాబితాలో పెడతారంటూ ప్రశ్నించారు. సీట్ల కేటాయింపుపై దాపరికం తనకు నచ్చడం లేదని, అందుకే వచ్చ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం స్పందన బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం నుంచి వచ్చే సంకేతాలను బట్టి పార్టీలో ఉండాలా? లేదా? అనే దానిపై కీలక ప్రకటన చేస్తానని బాబు మోహన్ అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదని, తనను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన పాపులారిటీ గురించి తెలియదా? తన పేరును మొదటి జాబితాలో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. ఈ బాధతో పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీకి ప్రచారం కూడా చేయనని అన్నారు. టికెట్ కేటాయింపుపై నాన్చుడు ధోరణి సరికాదని, అందరికీ తెలిసిన తనను కూడా పక్కన పెడుతున్నారని అసంతృప్తి చెందారు. తన కుమారుడికి టికెట్ ఇస్తామని చెబుతున్నారని, కానీ ఈ విషయం తనకు నేరుగా చెప్పాలి కదా? అని ప్రశ్నించారు. తన కుమారుడికి టికెట్ ఇస్తామని చెబుతూ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 'నా కొడుక్కి టికెట్ ఇవ్వండి.. ఎవరికైనా మీరు టికెట్ ఇచ్చుకోండి.. కానీ ఈ విషయం నాకు ఎందుకు చెప్పడం లేదు. ఈ దాపరికం నాకు నచ్చడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నా' అని బాబు మోహన్ తెలిపారు.
తాను రాజీనామా చేయాల్సి వస్తే పార్టీలో తనకు జరిగిన అవమానాలు అన్నీ చెబుతానని, తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రీకొడుకుల మధ్య యుద్దం అని, తండ్రికి రాదు.. కొడుక్కి టికెట్ వస్తుందంటూ వార్తలు రాస్తున్నారని అన్నారు. కాగా బాబు మోహన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే త్వరలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. మరి ఆయన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.