Bhatti Vikramarka: అధికారం కోసం ఎన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారు- సీఎం కేసీఆర్‌పై భట్టి ధ్వజం
Bhatti Vikramarka: రాజ్యాధికారం కోసం కేసీఆర్ ఎన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.
Bhatti Vikramarka: రాజ్యాధికారం కోసం కేసీఆర్ ఎన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. గాంధీ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బొరజ్ గ్రామానికి చెందిన రమాకాంత్ దళిత బంధు రాక ఆత్మహత్య చేసుకున్నాడని, యువకుడి బలవన్మరణానికి కేసీఆర్ కారణమంటూ లేఖ రాసి చనిపోయారని అన్నారు. యువకుడి సూసైడ్ నోట్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
సబ్ ప్లాన్ అమలు చేయలేదు
అణగారిన వర్గాల సంక్షేమం గతంలో కాంగ్రెస్ పార్టీ శ్రమించిందని. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను బీఆర్ఎస్ అమలు చేయకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మోసపూరిత వాగ్దానాలతో దళిత గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ వస్తే కష్టాలు తీరతాయన్న యువత కలలు నేరేవేరలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, అప్పుడు బలహీన వర్గాల కలలు నిజం చేస్తామన్నారు.
ప్రజల తెలంగాణ తీసుకొస్తాం
దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ తీసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. దళిత, గిరిజన కుటుంబాల చెందిన వారెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మోసపోయిన వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నెల రోజుల్లో కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని అన్నారు.
షర్మిల నిర్ణయాన్ని స్వాగతించిన భట్టి
కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. వైఎస్‌ఆర్ బిడ్డగా కాంగ్రెస్‌తో షర్మిల కలిసి రావడం శుభపరిణామమని చెప్పారు. మరోవైపు హుజూరాబాద్‌లో ఓట్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని భట్టి ఆరోపించారు. దళితబంధు పథకానికి బడ్జెట్‌లో రూ.17వేల కోట్లు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఈ ఏడాది ఎంతమందికి ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజల తెలంగాణ గెలవాలి
నమ్మి ఓట్లేసిన ప్రజలను సీఎం కేసీఆర్ నిలువునా ముంచారని బట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలకు కేసీఆర్ ఓ కలల ప్రపంచాన్ని చూపించారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధంలో ప్రజలే గెలవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని భట్టి విక్రమార్క చెప్పారు. దళితులకు ఇచ్చిన హామీలు కేసీఆర్ నిలుపుకోలేదని ఆయన విమర్శించారు.
ఆ విషయం ఎంఐఎంకు అవసరం లేదు
పాలకులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలని, బలహీన వర్గ ప్రజలు ఏమైనా పర్వాలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటుందని బట్టి విమర్శించారు. దళిత, గిరిజన, మైనార్టీ బలహీన వర్గాలు 92 శాతం రాష్ట్రంలో ఉన్నారని, సీఎం కావడానికి మొదటగా దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ కలల ప్రపంచం సృష్టించారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి అవసరం లేదన్నారు. ఎంఐఎం అభ్యర్ధుల గురించి ఒవైసీ పట్టించుకుంటే సరిపోతుందన్నారు.