Rahul Gandhi: అడ్డగోలుగా ఎమ్మెల్యేల కొనుగోలు, అంతా నవ్వులపాలు - రాహుల్ గాంధీ
దొంగతనం చేసే అవకాశం ఉన్న చోటల్లా కేసీఆర్ అండ్ కో దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో ఆయన మాట్లాడారు.
టీఆర్ఎస్, బీజేపీ రెండూ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివే అని కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆ రెండు పార్టీలూ ఒకదానికి మరొకటి సహకరించుకుంటూ ఉంటాయని అన్నారు. గతంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లు విషయంలోనూ టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించిందని గుర్తు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడారు.
‘‘తెలంగాణలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఇదే ఉత్సాహంతో కాశ్మీర్ వరకు ఉంటుంది. దేశంలో హింస ద్వేషం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మన దేశంలో శాంతి భద్రతల వాతావరణంలో దేశ నిర్మాణం అవసరం ఉంది. అందుకే జోడో యాత్ర చేపట్టా. దేశంలో మోదీ రాష్ట్రంలో కేసీఆర్ దుష్ట పాలన సాగిస్తున్నారు. పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది.
కాంగ్రెస్ రైతు పక్షపాతి. పార్లమెంట్ సాక్షిగా అన్నదాతల కోసం అనేక బిల్లులు తెచ్చాం. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ టీఆర్ఎస్ సమ దూరంలో ఉన్నాయి. అవి రెండూ కాంగ్రెస్ కు శత్రువులు. నాణేనికి బొమ్మ బొరుసు మాదిరే టీఆర్ఎస్ బీజేపీ కూడా. రెండు పార్టీలు ఒకదానికోకటి సహకరించుకుంటూ డ్రామాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పార్టీలు అవి. అడ్డగోలుగా ఎమ్మెల్యేల కొనుగోలుతో నవ్వులపాలు చేస్తున్నారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దే.
దొంగతనం చేసే అవకాశం ఉన్న చోటల్లా కేసీఆర్ అండ్ కో దోచుకుంటున్నారు. 15 వేల కోట్ల మియాపూర్ భూముల కుంభకోణంలో ఎలాంటి విచారణ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో విచ్చలవిడి అవినీతి జరిగింది. టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ పార్టీలు కాకుండా వ్యాపార సంస్థలుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేశాయి.
నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ తారాస్థాయికి చేరింది. నోట్ల రద్దు జీఎస్టీ నిర్ణయాల వల్ల చిన్న మధ్య తరహా వారి మీద ప్రభావం బాగా పడింది. యావత్ దేశంలోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రోజురోజుకు నిరుద్యోగ సమస్య ధరల పెరుగుదల ఎక్కువ అవుతోంది. పెట్రోల్ గ్యాస్ ధరల పెరుగుదలకు మోదీ ఎం సమాధానం చెబుతారు? రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాటిని ఎలుగెత్తి చాటాడానికే భారత్ జోడో యాత్ర. మీ అభిమానం ప్రేమతోనే నేను నడుస్తున్నా. ఇది సాధారణ యాత్ర కాదు మీరిచ్చిన ఉత్సాహంతోనే నడుస్తున్నా. రాష్ట్రంలో రైతులతో మాట్లాడి స్వయంగా వారి సమస్యలు తెలుసుకుంటున్నా’’ అని రాహుల్ గాంధీ మాట్లాడారు.
నేడు మూడో రోజు యాత్ర
రాహుల్ గాంధీ చేపట్టి ‘భారత్ జోడో యాత్ర’ 51వ రోజుకు చేరుకుంది. తెలంగాణలో మూడో రోజు పాదయాత్ర మరికల్ మండలం యలిగండ్ల నుంచి యాత్ర మొదలుపెట్టారు. నేడు మరికల్, దేవరకద్ర మీదుగా మన్యం కొండ వరకు భారత్ జోడోయాత్ర కొనసాగుతుంది. నేడు మొత్తం 23.3 కిలో మీటర్ల పాదయాత్ర కొనసాగనుంది.
నేడు రాహుల్ గాంధీ వెంట కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ నేత కేసీ వేణు గోపాల్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఇంకొంత మంది నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, గోప్లపూర్ కలాన్ లో విరామం తీసుకున్న అనంతరం మళ్లీ సాయంత్రం పాదయాత్ర కొనసాగిస్తారు. మన్యంకొండ దేవాలయం ప్రాంతంలో జరిగే సమావేశంలో రాహుల్ పాల్గొననున్నారు.