Basara IIIT: మరోసారి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ! కాదంటున్న వైద్యులు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారన్న వార్తలు కలకలం రేపాయి. అయితే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.
బాసర ట్రిపుల్ ఐటీలో మళ్ళీ ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు కడుపునొప్పి భరించలేక తరగతి గదుల్లోంచి మధ్యలోనే వెళ్లిపోయారని యూనివర్శిటీ సిబ్బంది చెబుతున్నారు. కుళ్ళిన క్యాబేజీ వండటంతో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు విద్యార్థులు. వంటకు ముందే క్యాబేజీ కుళ్లిపోయి ఉన్నట్లు గమనించినట్టు సమాచారం. అయినా మెస్ నిర్వాహకులు అదే వండటంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు చెబుతున్నారు. వండే ముందు అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించినప్పటికి తూతూ మంత్రంగా పరిశీలన చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
కుళ్లిన క్యాబేజీతో కూర వండారని ఆరోపణలు
అస్వస్థతకు గురైన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అక్కడికి ఎవరిని వెళ్ళనీయకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. విద్యార్థులసెల్ ఫోన్లను అనుమతిoచటం లేదు. మరోవైపు ట్రిపుల్ ఐటీ వైద్యులు మాత్రం విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి కాలేదని, సీజనల్ వ్యాధుల వల్లే విద్యార్థులు చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు వైద్యులు. ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేస్తున్నారు.
ఇప్పటికే మూడు సార్లు ఫుడ్ పాయిజనింగ్
ఇటీవలే 350కి పైగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కలుషితమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని అస్వస్థతకు గురయ్యారు. కొందరు విద్యార్థులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. దాదాపు 5 రోజుల పాటు కొందరు విద్యార్థులు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందారు. దీంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం హైదరాబాద్ లోని మంత్రి సబిత ఇంటి వద్ద ఆందోళన చేశారు. అయినా బాసర ట్రిపుల్ ఐటీలో మార్పు రావటం లేదు. నిత్యం బాసర ట్రిపుల్ ఐటీ వివాదాల్లోకి వస్తూనే ఉంది. తాజాగా ట్రిపుల్ ఐటీలోని 15 విభాగాల్లో అధికారులను కూడా మార్చారు. అయినా మెస్ నిర్వాహణలో ఏమాత్రం మార్పు రావటంలేదు.
క్యాంటీన్ కాంట్రాక్టర్‌పై ఇప్పటికీ చర్యలు తీసుకోని అధికారులు
ఇటీవలే కుళ్ళిన ఆహార వస్తువులను సైతం విద్యార్థులు బయట పెట్టి మెస్ కాంట్రాక్టర్ తీరును ఎండగట్టారు. దాదాపు 8 వేల మంది ఉద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చదువుతున్నారు. భోజనం విషయంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెస్ కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవడం మూడో సారి అంటున్నారు విద్యార్థులు. కలుషిత ఆహారం తినటం వల్ల విద్యార్థిలు ఇలా అనారోగ్యం పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా .... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.