Rainbow Hospital : ప్రసవం జరుగుతుండగానే వినూత్న శస్త్రచికిత్స, శిశువు ప్రాణాలు కాపాడిన రెయిన్‌బో వైద్యులు
Rainbow Hospital : బంజారాహిల్స్ రెయిన్ బో వైద్యులు అత్యంత అరుదైన చికిత్స చేశారు. తల్లి కడుపులో ఉన్న శిశువు మెడపై భారీ కణితిని గుర్తించిన వైద్యులు ఎగ్జిట్ అనే చికిత్స విధానంతో శిశువు ప్రాణాలు కాపాడారు.
Rainbow Hospital : రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు అత్యంత అరుదైన చికిత్స చేశారు. పుట్టబోయే బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ చికిత్స విధానాన్ని అమలు చేసి బిడ్డ ప్రాణాలు రక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ఎగ్జిట్(ఎక్సుటెరో ఇంట్రాపార్టమ్ ట్రీట్‌మెంట్) వైద్యం చేశారు. పుట్టకముందే అరుదైన చికిత్స పొందిన ఓ అసాధారణ శిశువు కథ ఇది. వరంగల్ కు చెందిన దంపతుల రొటీన్ ప్రెగ్నెన్సీ స్కానింగ్‌లో కడుపులో ఉన్న శిశువు మెడ మీద భారీ కణితి ఉందని తెలుసుకున్నారు. దీని వల్ల బిడ్డ ప్రాణానికి ప్రమాదం అని, అబార్షన్ చేయించుకోవాలని స్థానిక వైద్యులు సూచించారు. అయినా పట్టు వదలని దంపతులు బిడ్డ బతికే అవకాశం దొరుకుతుందనే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ వచ్చిన ఈ దంపతులు బంజారాహిల్స్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని వైద్యుల బృందాన్ని సంప్రదించారు.
స్పెషలిస్ట్ వైద్యులు
బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ECMO వంటి అధునాతన చికిత్సలు, కాలేయం, కిడ్నీ, బోన్ మ్యారోతో సహా పిల్లలలో వచ్చే న్యూరో సర్జరీలతో సహా సంక్లిష్ట శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. పెరినాటల్ కేర్ వంటి సంక్లిష్టమైన కేసులను ఇక్కడి వైద్యులు చాలా విజయవంతంగా నిర్వహించారు. నియోనాటాలజిస్ట్‌లు, పీడియాట్రిక్ ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌లు, పీడియాట్రిక్ సర్జన్లు, పీడియాట్రిక్ అనస్థీటిస్ట్‌లు, పీడియాట్రిక్ స్పెషాలిటీలలో కన్సల్టెంట్‌లు, ప్రసూతి వైద్య నిపుణులతో పాటు అనేక సంక్లిష్ట కేసులను విజయవంతంగా ఎదుర్కోవడంలో రెయిన్ బో వైద్యులకు పెట్టింది పేరు.
శిశువు మెడపై భారీ కణితి
స్పెషలిస్ట్ డాక్టర్ గాయత్రి, డాక్టర్ స్రవంతి, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ శ్రుతి, చీఫ్ అనస్థటిస్ట్ డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ గీత, ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ పివిఎల్‌ఎన్ మూర్తి, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరీష్ జయరామ్, డైరెక్టర్- ఎన్‌ఐసియు సర్వీసెస్, డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల, నియోనాటాలజిస్ట్ డాక్టర్ విజయన్, డాక్టర్ విజయన్ బృందం ఈ కేసును విజయవంతంగా డీల్ చేసింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ స్రవంతి శిశువు స్థితిని తల్లిదండ్రులకు వివరించారు. శిశువు మెడమీద ఉన్న భారీ కణితి శిశువు శ్వాసనాళం ఆహార నాళానికి అవరోధంగా నిలిచింది. శిశువు జీవించేందుకు ఏదైనా అవకాశం ఉందా అని అంటే, అత్యంత అరుదైన, వినూత్నమైన శస్త్ర చికిత్స ఏక్సిట్ ప్రొసీజర్ (ఎక్స్ యూటెరో ఇంట్రాపార్టమ్ ట్రీట్‌మెంట్)ను డెలివరీ సమయంలో చేయాలని సూచించారు. శిశువు ఇంకా తల్లిగర్భంలోనే ఉండటం వల్ల, ఆ శిశువుకు ఆక్సిజన్ సరఫరా మావి (ప్లాసెంటా) ద్వారా ప్రవహించే తల్లి రక్తంతో జరుగుతుంది. డెలివరీ తరువాత శిశువులు తమంతట తాముగా శ్వాసించాల్సి ఉంటుంది. కానీ మెడ మీద భారీ కణితి రావడం వల్ల శ్వాసనాళంలో అవరోధం ఏర్పడి ఆ శిశువు పుట్టిన తరువాత శ్వాసించడం సాధ్యం కాకపోవచ్చు. తగినంతగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో ఎగ్జిట్ ప్రక్రియ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీని లక్ష్యమేమిటంటే శిశువును పాక్షికంగా డెలివరీ చేయడంతో రక్తం, ఆక్సిజన్ ప్రవాహం ప్లాసెంటా నుంచి యథావిధిగా కొనసాగుతోంది. దీనివల్ల శిశువు శ్వాసించేందుకు ప్రత్యేక గొట్టం ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత వారు డెలివరీ పూర్తి చేస్తారు.
(చిన్నారితో తల్లిదండ్రులు)
25 మంది డాక్టర్లు
ఆ జంట తమ శిశువుకు ఎగ్జిట్ ప్రక్రియ చేసేందుకు అంగీకరించారు. ఫీటల్ మెడిసన్ కన్సల్టెంట్లు, ప్రసూతి వైద్యులు, ఆనస్తీషియస్ట్‌లు, ఈఎన్‌టీ సర్జన్లు, పీడియాట్రిక్ సర్జన్లు, నియో నాటాలజిస్ట్‌లు సహా పలువురు స్పెషలిస్ట్‌లు మధ్య వరుసగా చర్చించారు. ఈ బృందం మాక్ డ్రిల్ ను సైతం చేసి సమస్యలను ఊహించి, తగిన ప్రణాళికలతో పూర్తి స్థాయిలో సిద్ధమైంది. గర్భం దాల్చిన 37 వారాల తరువాత, తల్లికి సీజేరియన్ చేయడంతో పాటుగా ఎగ్జిన్ ప్రక్రియ చేశారు. అన్ని స్పెషాలిటీస్‌కు చెందిన 25 మంది డాక్టర్లు డెలివరీ సమయంలో హాజరు కావడమే కాకుండా తల్లి, బిడ్డలకు ఎలాంటి సహాయం అవసరమైనా చేయడానికి సిద్ధమయ్యారు. డెలివరీకి కొద్ది క్షణాల ముందు ఫీటల్ మెడిసన్ బృందం సిస్ట్ రిడక్షన్ చికిత్స అందించడం ద్వారా కణితి పరిమాణం తగ్గించి శిశువు డెలివరీ సాధ్యమయ్యే అవకాశం కల్పించారు. అనస్తీషియా బృందం ప్రత్యేక అనస్తీషియాను తల్లికి అందించడం వల్ల శిశువుకు ప్లాసెంటల్ బ్లడ్ సరఫరా చేసేలా చేయగలిగారు.
11 నిమిషాల పాటు
చీఫ్ అనస్తీషియస్ట్ డాక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ ‘‘ఛాతీ మిగిలిన శరీరాన్ని గాలికి బహిర్గతం చేయడం వల్ల ప్లాసెంటా వేరుచేయడం కూడా వేగవంతం అవుతుంది. అందువల్ల ప్రత్యేక ఔషధాలను వాడి శిశువు 11 నిమిషాల వరకూ ఊపిరి పీల్చుకునే వరకూ గర్భాశయం విశ్రాంతిగా ఉంటూనే తల్లి గర్భం నుంచి ప్లాసెంటా వేరయ్యే ప్రక్రియను సైతం ఆలస్యం చేస్తూ, తల్లి బీపీని మెయింటెన్ చేశాం. అలాగే గర్భాశయం లోపల ఒత్తిడి నిర్వహించడానికి ప్లాసెంటల్ విభజనను నివారించడానికి ఫ్లూయిడ్ సైతం ఇచ్చాం ’’ అని అన్నారు.
ఎగ్జిట్ విధానంతో బ్రీతింగ్ ట్యూబ్
సీనియర్ ప్రసూతి వైద్యులు డా. శృతి మాట్లాడుతూ ‘‘ శిశువు తల మాత్రమే ముందుగా బయటకు తీయడం ఓ వినూత్న అనుభూతి కలిగించింది. మిగిలిన శరీర భాగాలను 11 నిమిషాల పాటు తల్లిగర్భంలోనే ఉంచి గాలి మార్గం ఏర్పరిచే వరకూ పిండం బొడ్డు తాడు ద్వారా పిండం ఆరోగ్య స్థితిని పర్యవేక్షించాం’’ అని అన్నారు. వీడియో లారీన్గోస్కోప్‌గా పిలువబడే ప్రత్యేక ఉపకరణాలతో పాటుగా బ్రాంకోస్కోపీ వంటి సాధనాలు ఉన్నప్పటికీ గాలి మార్గం ఏర్పరచడం అత్యంత కష్టమైన ప్రక్రియగానే నిలిచింది. ఎందుకంటే, మెడపై భారీ కణితి కారణంగా శ్వాసనాళం ఓ వైపుకు నెట్టివేసినట్లుఉంది. ఈఎన్‌టీ సర్జన్ ట్రాకియోస్టోమీ చేశారు. అప్పటికీ ఆ శిశువు తల్లి గర్భంలోని ప్లాసెంటాతో అనుసంధానించే ఉంది. డెలివరీ సమయంలో ఈ శిశువు ఆరోగ్య పరిస్ధితి క్లిష్టంగా ఉంది. ఈ శిశువు జన్మించిన తరువాత శ్వాసించడానికి ఎగ్జిట్ ప్రక్రియతో పాటుగా ప్రత్యేక బ్రీతింగ్ ట్యూబ్ తోడ్పడింది.
600 గ్రాముల కణితి తొలగింపు
పీడియాట్రిక్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ మూర్తి మాట్లాడుతూ‘‘ తల్లి గర్భం నుంచి తల మాత్రమే డెలివరీ కావడంతో పాటుగా మెడపై భారీ కణితి ఉండి, స్వల్పకాలం పాటు తల్లి గర్భంతో అనుసంధానించి శిశువుకు ట్రాకియోస్టోమీ చేయడం అత్యంత సవాల్‌తో కూడిన అంశం. ఒకసారి వాయు మార్గం ద్వారా ట్యూబ్‌ను జొప్పించిన తరువాత నియోనాటల్ బృందం మరింతగా ఆ శిశువు ఆరోగ్య పరిస్ధితి సమీక్షించడంతో పాటుగా ఆ శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చేశారు’’ అని అన్నారు. ఒకసారి శిశువు ఆరోగ్య స్థితిని స్థిరీకరించిన తరువాత ఎన్‌ఐసీయుకు ఆ శిశువును తరలించడంతో పాటుగా హై లెవల్ వెంటిలేటర్ మద్దతును అందించారు. పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరీష్ ఈ శిశువు మెడమీద ఉన్న భారీ కణితిని తొలగించారు. ఈ కణితి 600 గ్రాముల బరువు ఉండటంతో పాటుగా 8 X 6 X 7 సెంటీ మీటర్ల పరిమాణం ఉంది. ఈ శస్త్ర చికిత్సకు నాలుగు గంటల సమయం పట్టింది.
50 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స
డాక్టర్ హరీష్ మాట్లాడుతూ ‘‘అతి చిన్న శిశువు మెడ పై ఇంత భారీ కణితిని తొలగించడం అనేది శస్త్ర చికిత్స పరంగా అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. ఎందుకంటే అత్యంత కీలకమైన నరాలు, నాళాలు అక్కడ ఉన్నాయి’’ అని అన్నారు. సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ విజయానంద్ తన అనుభవాలను వెల్లడిస్తూ ‘‘ ఇది వినూత్నమైన కేసు. ఎందుకంటే, శిశువు జన్మించక మునుపే చికిత్స చేయడం ప్రారంభమైంది. ఆమెకు అత్యాధునిక హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ మద్దతు సహా దాదాపు 50 రోజుల పాటు వెంటిలేటర్ మద్దతు అవసరమైంది. ఎన్‌ఐసీయులో ఆమె ఉన్న 12వారాలలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ 24 గంటలూ అత్యద్భుతమైన వైద్య నర్సింగ్ కేర్ అందుబాటులో ఉండటంతో విజయవంతంగా ఆ శిశువుకు చికిత్స చేయడంతో పాటుగా విజయవంతంగా డిశ్చార్జ్ చేశాం. ఇప్పుడు ఆ శిశువును ఐదు నెలల పాపాయిగా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఆమె తనంతట తానుగా శ్వాసించడంతో పాటుగా ఎదుగుదల కూడా బాగుంది’’ అని అన్నారు.
సవాల్ తో కూడిక కేసు
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఛైర్మన్– మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ ‘‘ ప్రతి జీవితమూ విలువైనది. మా డాక్టర్ల బృందం, అత్యంత సవాల్‌తో కూడిన కేసులలో సైతం శిశువుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. రెయిన్‌బో యొక్క నిష్ణాతులైన నిపుణుల బృందం , సమర్ధవంతమైన, ప్రభావవంతమైన, చక్కటి సమన్వయంతో కూడిన సంరక్షణ కారణంగానే దీనిని సాధించగలిగింది. భారతదేశమంతటా ఈ తరహా క్వాటెర్నరీ చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌ను ఏర్పాటుచేయాలనేది మా లక్ష్యం’’అని అన్నారు.