Bandla Ganesh : కాంగ్రెస్ ప్రభంజనం ఖాయం - బండ్ల గణేష్ జోస్యం !
కాంగ్రెస్ గెలుస్తుందని బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం చేస్తారన్నారు.
Bandla Ganesh : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. గాంధభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పుడే షాద్ నగర్ కు వెళ్ళి వచ్చానని.. మిత్రుడు వీర్లపల్లి శంకర్ నామినేషన్ వేస్తే ఊరు దాటడానికి గంట పట్టిందని.. జనాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాని, నాయకులను మేనేజ్ చేయచ్చు.. కానీ ప్రజలను మేనేజ్ చేయలేరని అన్నారు. 2023, నవంబర్ 30వ తేదీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని.. కాంగ్రెస్ అద్భుతం సృష్టించబోతుందని ఆయన చెప్పారు.
తాను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తనని.. ఇంతవరకు కాంగ్రెస్ కి తప్ప వేరే పార్టీకి ఓటేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ త్యాగాలు చేసిందని.. ఇప్పుడు దేశం కోసం రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీలు సేవ చేస్తున్నారని అన్నారు బండ్ల గణేష్. కురుక్షేత్ర మహా సంగ్రామంలో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. అన్నిటికి తెగించి తెలంగాణ ఇచ్చింది అమ్మ.. సోనియా గాంధీ అని అన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ తెలంగాణాలోనే మాకాం వేస్తారని చెప్పారు.రాహుల్ గాంధీ ఏనాడు హద్దులు దాటి మాట్లాడలేదన్నారు. బీఆరెస్ లో మంత్రులు ఎవరు.. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు ఎవరనేది సంబంధం లేదని.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నామని బండ్ల గణేష్ నమ్మకం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లోనూ బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ ఉన్న మహాకూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఓ సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని సవాల్ చేశారు. అది బ్లేడ్ చాలెంజ్ గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. తనకు రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటించారు. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తనకు టిక్కెట్ ఇస్తానన్నారని.. తానే వద్దన్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు మద్దతుగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు.
షాద్ నగర్ ప్రాంతంలో పౌల్ట్రీ వ్యాపారిగా ఉన్న బండ్ల గణేష్.. తర్వాత సినిమాల్లో కమెడియన్ గా చేశారు. తర్వాత నిర్మాణ రంగంలోకి వచ్చారు. కొన్ని భారీ సినిమాలు తీశారు. ఇటీవలి కాలంలో హీరోలు కాల్షీట్లు ఇవ్వకపోవడంతో సినిమాలు తీయడం లేదు. అయితే.. రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా స్పందిస్తున్నారు. ఎవరైనా ఏపీలో పవన్ ను విమర్శిస్తే వారికి కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. తాను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తనని.. గాంధీభవన్ లో చెబుతూంటారు.