Bandi Sanjay : ఐదో విడత పాదయాత్రకు బండి సంజయ్ రెడీ - ఎప్పుడు.. ఎక్కడి నుంచి అంటే ?
బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు ముహుర్తం ఖరారయింది. నిర్మల్ నియోజకవర్గంలోని అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 5వ విడత పాదయాత్ర ప్రారంభిస్తారు.
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతల పాదయాత్ర పూర్తి చేశారు. ఈనెల 28 నుండి బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. నిర్మల్ నియోజకవర్గంలోని అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 5వ విడత పాదయాత్ర ప్రారంభిస్తారు. కరీంనగర్ లో ముగింపు సభ నిర్వహిస్తారు. డిసెంబర్ 15 లేదా 16 వరకు పాదయాత్ర సాగుతుంది. సీఎం కేసీఆర్ కుటుంబ- అవినీతి -నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు 4 విడతలు పాదయాత్ర చేసి 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మొత్తం 21 జిల్లాల్లో 1178 కి.మీల మేర నడిచినట్లు బీజేపీ ప్రకటించింది. ఐదో విడత పాదయాత్రను అక్టోబర్‌లోనే చేయాలనుకున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నికల కారణంగా వాయిదా వేసుకున్నారు.
మునుగోడు ఉపఎన్నిక కారణంగా గతంలో వాయిదా
పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయని, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేననే సంకేతాలు వెలువడ్డాయని పాదయాత్ర సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ తెలిపారు. బండి సంజయ్ నాలుగు విడతలుగా పాదయాత్రను కొనసాగించి 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. మొత్తం బండి సంజయ్ పన్నెండు వందల అరవై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. గత ఏడాది ఆగస్టు 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుండి ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలోనూ బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేశారు.
ఈ నెల 26 నుంచి ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర
మరో వైపు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేపట్టిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 14వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒకట్రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ సూర్యపేట, తుంగతుర్తి, పరకాల, వర్థన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు.
ఎన్నికల వరకూ ప్రజల్లోనే ఉండాలని టీ బీజేపీ ప్రయత్నాలు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 బైక్ లతో ర్యాలీ నిర్వహించనున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. నిత్యం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించి స్థానిక సమస్యల గురించి నేతలు తెలుసుకోనున్నారు. ఇక నుంచి ఎన్నికల వరకూ బీజేపీ కార్యక్రమాలు విరామం లేకుండా నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నారు. పార్టీలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని.. వారందర్నీ సమన్వయం చేసుకుంటూ క్యాడర్ ముందుకెళ్లాల్సి ఉంటుందని పార్టీ నాయకత్వం క్యాడర్‌కు సూచిస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర ద్వారా ప్రజల్లో వచ్చిన పాజిటివ్ స్పందనను ఎన్నికల వరకూ కొనసాగేలా చూసుకోవాలని బీజేపీ నేతలనుకుంటున్నరు.