Bandi Sanjay : ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలు బీజేపీతో సాధ్యం - కేసీఆర్‌ను సాగనంపడం ఖాయమన్న బండి సంజయ్ !
బీజేపీ అధికాిరంలోకి వస్తేనే తెలంగాణలో ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలొస్తాయని బండి సంజయ్ ప్రకటించారు. ఇటీవల తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతూండటంతో ఈ వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay : అప్పులపాలైన తెలంగాణలో అభివ్రుద్ధి జరగాలన్నా... సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా... ఫస్ట్ తారీఖును ఠంచన్ గా ఉద్యోగులకు జీతాలు రావాలన్నా బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నిండా అప్పుల పాల్జేసి ప్రజల చేతికి చిప్ప ఇచ్చారని మండిపడ్డారు. ప్రజల బాధలు పోవాలన్నా... ఉద్యోగులకు ఠంచన్ గా జీతాలు రావాలన్న నరేంద్రమోదీ ఆధ్వర్యంలో తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని చెప్పారు. సిద్దిపేటలో ‘జనం గోస - బీజేపీ భరోసా’ యాత్రలో పాల్గొన్నారు.
‘‘జనం గోస –బీజేపీ భరోసా‘’ పేరుతో 10 రోజుల పాటు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నామని.. ఈ ర్యాలీ ప్రజల కోసమేమని బండి సంజయ్ తెలిపారు. ప్రపంచంలో ఏదో ఒక రంగంలో మాత్రమే శాస్త్రవేత్తలు, నిపుణులు ఉంటారు. కానీ మన సీఎం ఒకటి, రెండు కాదు... 100 రంగాల్లో నిపుణుడని బండి సంజయ్ సెటైర్ వేశారు. ఇరిగేషన్ ఇంజనీర్ అవతారమెత్తి రీడిజైన్ పేరుతో 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసి కట్టి ఊళ్లకు ఊళ్లను ముంచేసిండన్నారు. ఆయన కొడుకేమో మా నాన్న నదులకు నడక నేర్పినోడు అని అంటున్నడు.. కాళేశ్వరంలో మునిగిన మోటార్లకు కూడా ఈత నేర్పితే అవి పైకి తేలేవి కదా.. ప్రజలకు ఈ బాధ ఉండేది కాదు కదా అని చమత్కరిచారు .
కరోనా టైంలో డాక్టర్ అవతారమెత్తిండని ... కరోనా వస్తే పారాసెటమాల్ మాత్రమే వేసుకోమ్మని చెప్పి ఫాంహజ్ లో పడుకున్నడని విమర్శిచారు. ఇగ వానలు పడంగనే వాతావరణ శాఖ శాస్త్రవేత్త అవతారమెత్తిండు. ’క్లౌడ్ బరస్ట్‘ పేరిట తెలంగాణను దెబ్బకొట్టడానికి విదేశీ శక్తులు కుట్ర చేసినయన్నడు. ఈయన మాటలు చూసి పార్లమెంట్ లో ఎంపీలంతా నవ్వుకుంటున్నరు. అంతర్జాతీయ జోకర్ లా మారిండని విమర్శించారు. కేసీఆర్ మామూలోడు కాదు...దేశ్ కీ నేత... దిన్ బర్ పీత... మోడీ పే రోత... ఫాంహౌజ్ మే సోతా... అమాస పున్నమికు బాహర్ ఆతా...అంటూ కామెడీ కవిత వినిపించారు.
సిద్దిపేట జిల్లా ప్రజలు అష్టకష్టాలు పడి కేసీఆర్ ను పెంచి పెద్ద చేస్తే ప్రజలకు ఒక్క ఇల్లు ఇయ్యలేదన్నారు. హరీష్ రావుకు ఎందుకు సిగ్గు లేదో అర్ధం కావడం లేదన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా సైలెంట్‌గా ఉండి.. ఇచ్చిన తర్వాత అవాస్తవాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికేనా? ఇదేమైనా కల్వకుంట్ల జాగీరా? జనం ఇల్లు లేక, రేషన్ కార్డుల్లేక సమస్యలతో అల్లాడుతుంటే కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దోచుకుంటూ లండన్, మస్కట్, దుబాయి దేశాల్లో దాచుకుంటోందని ఆరోపించారు. ఈ విషయాలన్ని చెప్పి ప్రజలను చైతన్య పర్చేందుకే ఈ యాత్ర చేస్తున్నం. ప్రజల బాధలు తెలుసుకుని భరోసా ఇచ్చేందుకే బైక్ ర్యాలీలు చేస్తున్నామని బండి సంజయ్ ప్రకటించారు.