Bandi Sanjay: డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? జగన్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala Laddu News: తిరుమలలో లడ్డూలను కల్తీ చేసే దుస్థితి వచ్చిందని బండి సంజయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలను దర్శించుకుని నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.
Bandi Sanjay About Jagan: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తిరుమల డిక్లరేషన్ పై రాద్దాంతం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (MP Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతస్తులు హిందూ ఆలయాల్లోకి ప్రవేశిస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలు గతంలో ఎన్నో ఉన్నాయని, డిక్లరేషన్ ఇవ్వడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. దళితులకు తిరుమలలో అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పడం సిగ్గు చేటన్నారు. దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని చెప్పారు. దళితులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ క్రిస్టియన్లుగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ పాలనలో ఎంత మంది దళితులకు తిరుమలలో అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లో శ్రీ విద్యారణ్య నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేనడుగుతున్నా అన్యమతస్తులు తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొత్తగా ఇప్పటికప్పుడు పెట్టిన నిబంధన కాదు. అట్లాంటి తిరుమలకు క్రిస్టయన్ అయిన జగన్ వెళుతున్నప్పడు డిక్లరేషన్ ఇస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి? తిరుమలకు వచ్చే సరికి ఇట్లా మాట్లాడుతున్నారు కదా? గతంలో పూరి ఆలయానికి వెళితే ఇందిరాగాంధీ(Indira Gandhi) పార్శి మతస్తురాలని పెళ్లి చేసుకుందని రానివవ్వలేదు. నేపాల్(Nepal) పశుపతినాథ్ ఆలయానికి వెళ్లిన సోనియాగాంధీ క్రిస్టియన్ కాబట్టి రానివ్వలేదు. అంత మాత్రాన దాడి జరిగినట్లా?. తిరుమల విషయంలోనే ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు. జగన్(Jagan) తీరును చూస్తుంటే టీటీడీ లడ్డూ(TTD Laddu) ప్రసాదంలోనూ కల్తీ చేసినట్లు అనిపిస్తుంది. ఇది ముమ్మాటికీ హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమే. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉంది.’’ అని పేర్కొన్నారు.
నేను శిశు మందిర్ విద్యార్థినే
తాను కరీంనగర్ శిశు మందిర్ పాఠశాల విద్యార్ధినేని బండి సంజయ్ అన్నారు. ఘోష్ ప్రముఖ్ గా ఇక్కడికి వచ్చి బహుమతి గెలుచుకున్న రోజులు నాకు గుర్తొస్తున్నాయన్నారు. ర్యాంకుల కోసం పనిచేసే పాఠశాల విద్యారణ్య మందిరం కాదన్నారు. విజ్ఝానంతోపాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంస్థ శిశు మందిర్ అన్నారు. మమ్మీ, డాడీ కల్చర్ కు వ్యతిరేకం. అమ్మానాన్న అని పిలవాలని పిల్లలకు బండి సంజయ్(Bandi Sanjay) సూచించారు. డబ్బు సంపాదనలో పడి తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
చివరికి లడ్డూ కల్తీ చేసే దుస్థితి
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కూడా కల్తీ చేసే దుస్థితి వచ్చిందని మంత్రి బండి సంజయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో శేషా చలం కొండల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ ఏడు కొండలను రెండు కొండలకే పరిమితం చేసే కుట్ర చేస్తే... అడ్డుకున్నది బీజేపీ(BJP), వీహెచ్ పి(VHP) వంటి సంస్థలేనన్నారు. తిరుమలకు అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనేది నిబంధన ఉంది. కానీ జగన్ సీఎంగా ఉంటూ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలను దర్శించుకుని నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఇప్పుడు డిక్లరేషన్ అడిగితే... ఇదేం హిందుత్వం అని అంటున్నారు. ఆయన వ్యవహారం చూస్తుంటే లడ్డూ కల్తీ విషయంలో జరిగింది నిజమేనన్పిస్తోందన్నారు. బొట్టు పెట్టుకుని టోపీ పెట్టుకోకుండా నమాజ్ చేయబోమని మక్కా మసీదుకు హిందువులు వెళితే అనుమతిస్తారా? వాటికన్ సిటీ, జెరూసలెం వెళతానంటే ఒప్పుకుంటారా? తిరుమల విషయంలో ఈ నిబంధనను ఎందుకు వర్తింపజేయ కూడదు? హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమే. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉందన్నారు బండి సంజయ్.