TS High Court: గంగుల ఎన్నిక వివాదం, బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి - ఈ 20న తదుపరి విచారణ
TS High Court: మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై బీజేపీ నాయకుడు, ఎంపీ బండి సంజయ్ హైకోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది.
TS High Court: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై బీజేపీ నాయకుడు, ఎంపీ బండి సంజయ్ హైకోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. అడ్వొకేట్ కమిషనర్ సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం విశ్రాంత జిల్లా జడ్జిని అడ్వొకేట్ కమిషనర్‌గా హైకోర్టు నియమించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అడ్వొకేట్ కమిషనర్ ఎదుట బండి సంజయ్ గతంలో హాజరై వివరాలు సమర్పించి, వాంగ్మూలం ఇచ్చారు. పిటిషనర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని గంగుల కమలాకర్ తరఫు న్యాయవాది కోరడంతో అడ్వొకేట్ కమిషనర్ అంగీకరించారు.
పార్లమెంటు సమావేశాలు, వ్యక్తిగత పనులు, అమెరికా పర్యటన తదితర కారణాలతో క్రాస్ ఎగ్జామినేషన్‌కు పలుమార్లు వాయిదా కోరారు. ఎన్నికల పిటిషన్లు ఆరు నెలల్లో తేల్చాల్సి ఉన్నందున విచారణను ముగిస్తామని కోర్టు చెప్పడంతో 15న బండి సంజయ్ హాజరవుతారని ఆయన న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని బండి సంజయ్‌ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించిన సంజయ్.. క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై విచారణ సెప్టెంబరు 20న జరగనుంది.
వివాదం ఏంటంటే..
2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్.. బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడిపోయారు. గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేస్తోంది. అలాగే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పోటీ చేయగా బండి సంజయ్ విజయం సాధించారు.
పలు సార్లు వాయిదా హైకోర్టు ఆగ్రహం
ఈ నెల ప్రారంభంలో బండి సంజయ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ మేరకు క్రాస్ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్ హాజరయ్యేందుకు గడువు ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది కోర్టును కోరారు. పలుమార్లు గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల పిటిషన్లు 6 నెలల్లో తేల్చాల్సి ఉన్నందున విచారణను ముగిస్తామని హైకోర్టు చెప్పడంతో.. ఇంకొక్క సారి గడువు ఇవ్వాలని బీజేపీ నేత బండి సంజయ్ హాజరవుతారని ఆయన తరఫున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలంటే సైనిక సంక్షేమ నిధికి బండి సంజయ్ రూ.50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. జులై, ఆగస్టు నెలల్లో హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది.
గంగులకు ఈడీ నోటీసులు
మరోవైపు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఫెమా నిబంధనల కింద జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. శ్వేతా గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్ పేరిట గ్రానైట్ కంపెనీలను గంగుల సుధాకర్, గంగుల వెంకన్న నిర్వహిస్తున్నారు. గ్రానైట్స్‌ను చైనాకు ఎగుమతి చేసిన ఈ రెండు కంపెనీలు.. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు తేల్చారు.